Dayanidhi Maran: ఉత్తరాది అమ్మాయిలపై మారన్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:07 PM
చెన్నైలోని క్వాయిడ్-ఇ-మిల్లత్ ప్రభుత్వ మహిళా కళాశాల మంగళవారం జరిగిన కార్యక్రమంలో దయానిధి మారన్ పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అందజేసిన ల్యాప్‌టాప్‌లతో లబ్ధిదారులు చదువుకోవడం, ఇంటర్వ్యూలకు హాజరవడం జరుగుతోందని, ఇందుకు తాము గర్విస్తున్నామని చెప్పారు.
చెన్నై: బాలికల విద్య, కెరీర్ విషయంలో తమిళనాడు ఎంతగానో ప్రోత్సహిస్తోందని, అయితే పలు ఉత్తరాది రాష్ట్రాల్లో బాలికలను గడప కూడా దాటనీయకుండా ఇంటి పనులకే పరిమితం చేస్తున్నారని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ (Dayanidhi Maran) అన్నారు. ద్రవిడ ఉద్యమం, డీఎంకే ప్రభుత్వ విధానాల కారణంగానే మహిళా విద్యలో రాష్ట్రం ప్రగతిపథంలో ఉందన్నారు. ఉత్తరాది అమ్మాయిలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనమవుతున్నాయి.
చెన్నైలోని క్వాయిడ్-ఇ-మిల్లత్ ప్రభుత్వ మహిళా కళాశాల మంగళవారం నాడు జరిగిన కార్యక్రమంలో మారన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అందజేసిన ల్యాప్‌టాప్‌లతో లబ్ధిదారులు చదువుకోవడం, ఇంటర్వ్యూలకు హాజరవడం జరుగుతోందని, ఇందుకు తాము గర్విస్తున్నామని చెప్పారు. ఉత్తరభారతంలోని కొన్ని రాష్ట్రాల్లో మహిళలను ఉద్యోగాలకు వెళ్లనీయకుండా, ఇళ్లకు, వంటింటి గదులకు, పిల్లలను కనడానికి మాత్రమే పరిమితం చేస్తున్నారని అన్నారు. కానీ ద్రవిడ రాష్ట్రమైన తమిళనాడు మాత్రం బాలికల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. బయట పనులు చేసుకుంటున్న మహిళల ఆర్థిక స్వాలంబనకు తమిళనాడు ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని తెలిపారు.
బెస్ట్ సీఎం స్టాలిన్
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై మారన్ ప్రశంసలు కురిపిస్తూ.. ఇండియాలోనే ఆయన ఉత్తమ సీఎం అని, అత్యుతమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం తమిళనాడు అని ప్రశంసించారు. ద్రవిడియన్ మోడల్ పాలన, సంఘ సంస్కర్త పెరియార్ ఐడియాలజీ వెళ్లూనుకున్న తమిళనాడులో మహిళా విద్య, సామాజిక సమానత్వానికి ప్రాధాన్యత చెక్కుచెదరదని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ 'ఉలగం ఉంగల్ కైయిల్' పథకం కింద ఫైనల్ ఇయర్ విద్యార్థినులకు 900 ల్యాప్‌టాప్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ జననాయగన్ వాయిదాపై రాహుల్ ట్వీట్.. మోదీపై విమర్శలు
భూతల దాడులకు కూడా సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి