Share News

కర్ణాటకలో సీఎం డీకేతో పాటు కొలువుదీరనున్న 14 మంది మంత్రుల నూతన కేబినెట్!

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:27 PM

కాంగ్రెస్ ట్రబుల్‌షూటర్ డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ఈ సాయంత్రం బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు మరో 14 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కర్ణాటకలో సీఎం డీకేతో పాటు కొలువుదీరనున్న 14 మంది మంత్రుల నూతన కేబినెట్!
DK Shivakumar to Take Oath as Karnataka CM.. 14 Ministers Set to Join New Cabinet

బెంగళూరు, జూన్ 3: కర్ణాటక రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం మొదలుకానుంది. కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ (DK Shivakumar) ఈ సాయంత్రం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్ వేదికగా సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. డీకే శివకుమార్‌తో పాటు తొలి విడతలో 14 మంది మంత్రులు కేబినెట్‌లోకి వస్తున్నట్లు సమాచారం.


న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో సుదీర్ఘ చర్చల అనంతరం మంత్రుల తుది జాబితాకు ఆమోదం లభించినట్టు తెలుస్తోంది. సీనియర్ కాంగ్రెస్ నేత ఎం.బి. పాటిల్ తనకు మంత్రి పదవి ఖరారైన విషయాన్ని స్వయంగా వెల్లడించారు. సీఎం కాబోతున్న డీకే శివకుమార్ తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారని పాటిల్ పేర్కొన్నారు. ఇక, డీకే నూతన కేబినెట్‌లో చోటు దక్కించుకోబోతున్న ప్రముఖ నాయకులలో జి. పరమేశ్వర (డిప్యూటీ సీఎం రేసులో ఉన్నట్లు ఊహాగానాలు), ఎం.బి. పాటిల్, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య (మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు) ప్రముఖంగా ఉన్నారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల తర్వాత ఈ కేబినెట్‌ను మరింత విస్తరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఈ సాయంత్రం జరిగే డీకే ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భారీగా తరలివస్తోంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రణదీప్ సుర్జేవాలాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బెంగళూరులోని డీకేఎస్ నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరి పండగ వాతావరణాన్ని తలపించేలా సంబరాలు చేసుకుంటున్నారు.


1962 మే 15న కనకపురలో జన్మించిన డీకే శివకుమార్, 1980ల్లో విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989లో తన 27వ ఏట మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఆ తర్వాత వరుసగా 8 సార్లు అసెంబ్లీకి ఎన్నికై వొక్కలిగ సామాజిక వర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడల్లా ఎమ్మెల్యేలను కాపాడి, కాంగ్రెస్‌కు అండగా నిలవడంతో ఆయనకు 'ట్రబుల్‌షూటర్' అనే పేరు వచ్చింది.

గత మూడేళ్లుగా సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, కేపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు డీకే ప్రయత్నించారు. అనేక ఈడీ, ఐటీ విచారణలు ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పటికీ, కర్ణాటక రాజకీయాల్లో డీకే పట్టు ఏమాత్రం సడలలేదు. కాగా, గత వారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో, హైకమాండ్ ముందే కుదుర్చుకున్న అధికార మార్పిడి ఫార్ములా ప్రకారం డీకే శివకుమార్ ఇప్పుడు కర్ణాటక పీఠాన్ని అధిరోహిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బీజేపీకి అన్నామలై రాజీనామా!

290 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 10:53 AM