హిందుస్థాన్ ఎవరి జాగీరు కాదు: సింగర్ దిల్జిత్ దోసాంజ్
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:54 PM
ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇందౌర్ కచేరీ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇండోర్ కచేరీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన పాటల ప్రదర్శనపై అధికారులు విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా దివంగత ఉర్దూ కవి రాహత్ ఇందోరి రాసిన ప్రసిద్ధ కవితను ప్రస్తావించారు.
నవంబర్ 15న ఇండోర్‌లో జరిగిన కచేరీని దిల్జిత్ ‘జై శ్రీ మహాకాళ్’ నినాదంతో ప్రారంభించారు. అనంతరం తన ప్రదర్శనకు ఎదురైన అడ్డంకుల గురించి ప్రస్తావిస్తూ... ‘చూడండి.. ఇది మహాకాళుడి నేల. ఇక్కడికి రావడాన్ని ఎవరూ ఆపలేరు. గతంలోనూ నేను భయపడలేదు.. ఇప్పుడు కూడా భయపడటం లేదు. మీ అభిమానమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నన్ను ఇండోర్‌కు రాకుండా అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే ఒకసారి వస్తానని ఎవరికైనా మాటిస్తే.. ఆ మాట తప్పను. అలానే తాజాగా ఎన్ని ఆంక్షలు, అడ్డకులు ఎదురైన మీ ముందు నిలబడ్డాను’ అని అభిమానులను ఉద్దేశించి దిల్జిత్ దోసాంజ్ పేర్కొన్నారు. ఈ దేశపు మట్టిలో అందరి రక్తం కలిసి ఉంది, హిందుస్థాన్ ఎవరి జాగీరు కాదంటూ రాహత్ ఇందోరి రాసిన ప్రసిద్ధ కవితను దిల్జిత్ మరోసారి ప్రస్తావించారు.
ఇండోర్‌లో దిల్జిత్ ఇలా రాహత్ ఇందోరి కవితను ప్రస్తావించడం ఇది రెండోసారి. గతంలో 2024 డిసెంబర్ 8న జరిగిన కచేరీ సందర్భంగా స్థానికంగా నిరసనలు వ్యక్తమైనప్పుడు కూడా ఆయన ఇదే కవితను చదివారు. అలానే ఆయన పాడే కొన్ని పాటలపై అధికారులు నిషేధం విధించారు. పాడే పాటల్లో మద్యం, మాదకద్రవ్యాలు, ఆయుధాలను ప్రోత్సహించేలా సాహిత్యం ఉందంటూ నాలుగు పాటలు పాడకూడదని అధికారులు ఆదేశించారు. ఆ పాటలు పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఇండోర్ కచేరీకి ముందు స్థానికంగా ఉండే మూడు ప్రైవేటు పాఠశాలలు, మేయర్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, అవి నకిలీ బెదిరింపులుగా పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. కాగా, అహ్మదాబాద్‌లో జరగనున్న ఆయన తదుపరి షోలోనూ కొన్ని పాటలపై ఇలాంటి అభ్యంతరాలే వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
సచిన్‌లా ఎదుగుతాడా? కాంబ్లీలా మిగిలిపోతాడా?.. వైభవ్‌పై కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం
ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం