Share News

కేంద్రంపై విరుచుకుపడ్డ స్టాలిన్.. నిరసనలకు పిలుపు!

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:40 PM

నియోజకవర్గాల పునర్విభజన బిల్లు దేశంలో హాట్ టాపిక్ అయింది. రేపు(గురువారం) లోకసభలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు అంతటా నల్లజెండాల ప్రదర్శనకు పిలుపునిచ్చారు.

కేంద్రంపై విరుచుకుపడ్డ స్టాలిన్.. నిరసనలకు పిలుపు!
Delimitation bill India

న్యూఢిల్లీ/చెన్నై, ఏప్రిల్ 15: దేశ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లు హాట్ టాపిక్ అయింది. రేపు (గురువారం) లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, దక్షిణాది రాష్ట్రాలు మిశ్రమ గళాన్ని వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ కేంద్ర తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డీలిమిటేషన్ ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న 'చారిత్రక అన్యాయం'గా స్టాలిన్ అభివర్ణించారు. 'కేంద్ర ప్రభుత్వం నిప్పుతో చెలగాటం ఆడుతోంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా పాటించి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు శిక్ష విధిస్తారా?' అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయంగా లబ్ధి చేకూర్చి, దక్షిణాది ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.


రేపు తమిళనాడు అంతటా 'బ్లాక్ ఫ్లాగ్' నిరసన

ఈ బిల్లుకు వ్యతిరేకంగా రేపు తమిళనాడు వ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన తెలపాలని డీఎంకే పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇంటింటిపై నల్లజెండాలు ఎగురవేయాలని రాష్ట్ర ప్రజలను స్టాలిన్ కోరారు. 'తమిళనాడు పోరాడుతుంది.. తమిళనాడు గెలుస్తుంది' అంటూ ఆయన ప్రకటించారు.

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన జరిగితే, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల లోకసభ సీట్లు తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల సీట్లు భారీగా పెరుగుతాయన్నది సీఎం స్టాలిన్ అభియోగం. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల గొంతు నొక్కడం సమాఖ్య వ్యవస్థకే ప్రమాదకరమని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నిధుల పంపిణీలో అన్యాయం జరుగుతోందని, ఇప్పుడు రాజకీయంగా కూడా మొండిచేయి ఎదురవుతుందని ఆయన వాదిస్తున్నారు.

దక్షిణాది ఆత్మగౌరవం కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే భారీ మూల్యం తప్పదని ఆయన హెచ్చరించారు. మరోవైపు, రేపు పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న తరుణంలో విపక్షాలు ఐక్య పోరాటానికి సిద్ధమవుతున్నాయి. రాజ్యాంగ విలువలు, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలని కోరుతూ గళం ఎత్తేందుకు సిద్ధమయ్యాయి. ఈ పోరు కేవలం సీట్ల కోసం మాత్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాల ఉనికి, గౌరవం కోసమని విపక్ష పార్టీలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు

మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం

కీలక భేటీకి ఎన్డీఏ సిద్ధం.. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధాన చర్చ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 15 , 2026 | 01:43 PM