ఢిల్లీలో హై అలర్ట్.. జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు, 46 మెట్రో స్టేషన్లు మూసివేత
ABN , Publish Date - Oct 10 , 2026 | 08:30 AM
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
Delhi Protest Metro Station Closure: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ఆందోళనలు చేపట్టేందుకు పిలుపునిచ్చిన 'సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్' (CJP)విపక్షాల నిరసనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అనుమతి లేనప్పటికీ నిరసనలకు వెనకాడబోమని ఆందోళనకారులు స్పష్టం చేయడంతో, ఢిల్లీ పోలీసులు నగరాన్ని అంచెలంచెలుగా దిగ్బంధించారు.
జంతర్ మంతర్ పరిసరాలతో పాటు ఢిల్లీ వ్యాప్తంగా 35,000 మందికి పైగా ఢిల్లీ పోలీసు, CAPF, CRPF బలగాలను మోహరించారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా నగర వ్యాప్తంగా 46 మెట్రో స్టేషన్‌లను తాత్కాలికంగా మూసివేశారు. సరిహద్దుల వద్ద తనిఖీలు కఠినతరం చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనలపై పారదర్శకత కోసం బందోబస్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందికి బాడీ క్యామ్‌లను కేటాయించారు. ఇవి రాత్రి సమయంలో కూడా స్పష్టంగా రికార్డ్ చేయగలవని పోలీసులు తెలిపారు. నిరసన కారులతో ఘర్షణలు లేదా దురుసు ప్రవర్తన ఆరోపణలు వస్తే ఈ కెమెరాలే నిజానిజాలను నిరూపిస్తాయని పేర్కొన్నారు.
ముఖ గుర్తింపు వ్యవస్థలు (FRS), సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, భవనాల పైకప్పులపై ప్రత్యేక నిఘా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆందోళనలో భాగంగా అదుపులోకి తీసుకునే వారిని తరలించడానికి ఛత్రసాల్ స్టేడియం, రాజీవ్ గాంధీ స్టేడియం, యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి ఆరు ప్రాంతాలను ప్రత్యేక కేంద్రాలుగా మార్చారు.
'ప్రభుత్వం తన ప్రజలపైనే యుద్ధం చేస్తోంది' సీజేపీ ఆందోళనకారుల మండిపాటు
నిరసనలో పాల్గొనేందుకు ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరిన CJP కార్యకర్త అభిజీత్ దిప్కే మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'ప్రధాని మోదీ దేశ యువతకు, ప్రజలకు భయపడుతున్నారు. లేకపోతే రైళ్లు, మెట్రోలు, ఇంటర్నెట్ సేవలు నిలిపి వేయాల్సిన అవసరం ఏముంది? జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్మీని, నక్సల్ ప్రాంతాల నుంచి సీఆర్పీఎఫ్‌ను తెచ్చి ఢిల్లీలో మోహరించారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు తమ దేశ ప్రజలపైనే యుద్ధం ప్రకటిస్తున్నారా?' అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 ప్రకారం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తమకుందని, అరెస్టులకు లేదా యూపీఏ, ఎన్‌ఎస్‌ఏ చట్టాలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికే కాన్నాట్ ప్లేస్, జన్పథ్ ప్రాంతాల చుట్టూ ఆందోళన చేయడానికి ప్రయత్నించిన కొద్ది మంది నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రాల యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సర్వీస్ రూల్స్‌లో సవరణలు