కేజ్రీవాల్‌కు గట్టి దెబ్బ.. రీక్యూసల్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
ABN , Publish Date - Apr 20 , 2026 | 09:25 PM
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జస్టిస్ స్వరణ్‌కాంత శర్మను విచారణను నుంచి తప్పించాలని కోరుతూ పిటిషన్ వేసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తదితరులకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన విశ్వసనీయతను, నిష్పాక్షికతను ప్రశ్నిస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్టు జస్టిస్ స్వరణ్‌కాంత్ శర్మ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జస్టిస్ స్వరణ్ కాంత శర్మను విచారణను నుంచి తప్పించాలని కోరుతూ పిటిషన్ వేసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), తదితరులకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన విశ్వసనీయతను, నిష్పాక్షికతను ప్రశ్నిస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్టు జస్టిస్ స్వరణ్‌కాంత్ శర్మ స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అనుమానాల ఆధారంగా న్యాయమూర్తి సమగ్రతను సవాలు చేయడం తగదని అన్నారు.
'నేను పెన్‌తో జడ్జిమెంట్ రాయడం మొదలు పెట్టినప్పుడు కోర్టుగది నిశ్శబ్దంగా మారిపోయింది. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన న్యాయమూర్తిపై ఎంత గురుతర బాధ్యత ఉంటుందో ఇది చెబుతోంది. దటీజ్ భారత్. ఇది ఒకరకంగా నాకు పరీక్ష. నేను తప్పుకుంటే ఆరోపణల్లో నిజం ఉందంటారు. తప్పుకోకుండా వ్యతిరేకంగా తీర్పు ఇస్తే పక్షపాతం అంటారు. నేను ఈ ఉచ్చులో పడను' అని స్వరణ్ కాంత్ శర్మ వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, రాజకీయ నాయకులు బహిరంగంగా చేసే వ్యాఖ్యలు కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయలేవని, వాటిని సాక్ష్యాలుగా పరిగణించలేమని జస్టిస్ స్వరణ్ కాంత్ శర్మ స్పష్టం చేశారు. రాజకీయ నాయకుడి భార్య, పిల్లలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఒక జడ్జి పిల్లలు న్యాయవాద వృత్తిలోకి రాకూడదని ఎలా చెబుతారు? ఇది న్యాయమూర్తుల కుటుంబానికి ఉన్న హక్కులను లాక్కోవడం కాదా? అని ఆమె ప్రశ్నించారు. జడ్జి కుటుంబసభ్యులు ఎలా జీవిస్తున్నారనే ప్రశ్నించే హక్కు ఏ కక్షిదారుకు ఉండదన్నారు. జడ్జి పిల్లలు ఎలా ఉండాలో కక్షిదారు శాసించడం ఏమిటని ప్రశ్నించారు. నిర్ధారణ కాని ఆరోపణలు చేయడం న్యాయవ్యవస్థకే కీడు చేయడం అవుతుందని ఆమె హెచ్చరించారు. ఇలాంటి దాడులకు భయపడి జడ్జి వైదొలిగితే తమకు నచ్చని న్యాయమూర్తిని తొలగించే సంప్రదాయం మొదలవుతుందని అన్నారు. నిరాధార ఆరోపణల కోసం బాధ్యతల నుంచి వైదొలిగే ప్రసక్తి లేదని జస్టిస్ శర్మ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
నేషనల్ హెరాల్డ్ కేసు.. గాంధీ కుటుంబానికి తాత్కాలిక ఊరట
పది రూపాయలతో మోదీ డ్రామా.. మమత విసుర్లు