రణరంగంలా ఢిల్లీ వీధులు.. మరోసారి నిరసనకు సీజేపీ పిలుపు..
ABN , Publish Date - Oct 11 , 2026 | 07:11 AM
దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆదివారం ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు పార్టీ ప్రకటించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చింది. ఆదివారం ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించింది. శనివారం నిరసనల సందర్భంగా పోలీసులు పలువురు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నప్పటికీ వెనక్కి తగ్గేది లేదని పార్టీ నేత అజింక్య షిండే స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ సీఈసీ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తామని ప్రకటించారు.
కాగా, అక్టోబర్ 10న ఢిల్లీలో CJP నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు పలువురు కీలక నేతలను అరెస్టు చేశారు. అలాగే, పలువురు రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, మాణిక్ సర్కార్‌లను అరెస్టు చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. ఈ పరిణామాలతో శనివారం ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, నిరసనలపై పోలీసులు విధించిన ఆంక్షలను సీజేపీతో పాటు ఇండియా కూటమి తీవ్రంగా విమర్శించింది. తమ ఆందోళనను కొనసాగిస్తామని, ఆదివారం మరోసారి జంతర్ మంతర్‌కు చేరుకుంటామని సీజేపీ నేతలు ప్రకటించారు.
సీజేపీ ప్రకటనతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ సహా కీలక ప్రాంతాల్లో భారీగా మోహరించారు. మరోవైపు, ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో జంతర్ మంతర్, కనాట్ ప్లేస్, మండి హౌస్, పటేల్ చౌక్, పార్లమెంట్ స్ట్రీట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే, రైల్వే స్టేషన్లు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినళ్లు, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని, అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించారు. కాగా, నేడు ఢిల్లీలో పరిస్థితులు ఎలా ఉండనున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి
భారత్ ప్రజాస్వామ్య దేశం.. వలసరాజ్యం కాదు
కెనడాలో తెలుగు మహిళ ప్రచార హోరు