Maharashtra Results: అండర్‌వరల్డ్ మాజీ డాన్ కుమార్తెలు ఓటమి
ABN , Publish Date - Jan 16 , 2026 | 05:54 PM
బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మూడుసార్లు కార్పొరేటర్‌గా గీత పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఆమె 212వ వార్డు నుంచి పోటీచేసి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి అమ్రిన్ షెహజాద్ అబ్రహాని చేతిలో ఓటమి పాలయ్యారు.
ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. ముంబైలో ఒకప్పుడు పేరుగాంచిన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎమ్మెల్యే అరుణ్ గావ్లీ (Arun Gawli) కుమార్తెలైన గీత గావ్లీ, యోగిత గావ్లీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తమ తండ్రి గావ్లి స్థాపించిన అఖిల్ భారతీయ సేన (ABHS) తరఫున ముంబైలోని బైకుల్లా ఏరియా నుంచి ఈ ఇద్దరూ పోటీ చేశారు.
బృహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నుంచి మూడుసార్లు కార్పొరేటర్‌గా గీత పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఆమె 212వ వార్డు నుంచి పోటీ చేసి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి అమ్రిన్ షెహజాద్ అబ్రహాని చేతిలో ఓటమి పాలయ్యారు. 207వ వార్డు నుంచి యోగిత తొలిసారి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రోహిదాస్ లోఖాండే చేతిలో ఓటమి చవిచూశారు.
ముంబైలో 2007 మార్చి 2న శివసేన కార్పొరేటర్ కమలాకర్ జామ్‌సండేకర్ తన నివాసంలో హత్యకు గురైన కేసులో అరుణ్ గావ్లీకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ కేసులో సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడంతో 2025 సెప్టెంబర్‌లో నాగపూర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. 1980, 1990 దశకంలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ డి-కంపెనీకి సమాంతరంగా ఆయన క్రైమ్ సిండికేట్ నడిపారు. 70 ఏళ్ల గావ్లి 2004 నుంచి 2009 వరకూ ముంబైలోని చించ్‌పోకలీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి గెలుపు
ఓటు చోరీ ముమ్మాటీకీ దేశద్రోహ చర్యే.. బీఎంసీ ఓట్ల లెక్కింపు వేళ రాహుల్ గాంధీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి