Share News

Bihar Congress: బిహార్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. ఎన్డీయే వైపు చూస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Jan 13 , 2026 | 08:30 PM

కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరుగురూ సామూహికంగా కానీ, కనీసం వారిలో మూడింట రెండు వంతుల మంది (నలుగురు) కానీ పార్టీకి గుడ్‌బై చెప్పి, ఎన్డీయేతో జతకట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Bihar Congress: బిహార్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. ఎన్డీయే వైపు చూస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు
Rahul gandhi

పాట్నా: రెండు నెలల క్రితం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఎన్డీయే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 243 అసెంబ్లీ స్థానాల్లో 202 సీట్లు దక్కించుకుని రాష్ట్ర చరిత్రలోనే రికార్డు సృష్టించింది. తాజాగా బిహార్ రాజకీయాల్లో మరికొన్ని కీలక పరిణామాలు కూడా చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో కేవలం 6 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ (Congress) పార్టీ ఇప్పుడు పూర్తిగా ఖాళీ కానుందనే ప్రచారం బలంగా జరుగుతోంది.


కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆరుగురూ సామూహికంగా కానీ, కనీసం వారిలో మూడింట రెండు వంతుల మంది (నలుగురు) కానీ పార్టీకి గుడ్‌బై చెప్పి, ఎన్డీయేతో జతకట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మకర సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా ఈ పరిణామాలుంటాయని చెబుతున్నారు.


మకర సంక్రాతి పండుగను పురస్కరించుకుని బిహార్ కాంగ్రెస్ కార్యాలయంలో 'దహి-చుర' (పెరుగు-అటుకులు) కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆరుగురు ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా హాజరు కాలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం చొరవతో గత వారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంజీఎన్ఆర్‌జీఏ అంశంపై పాట్నాలో సమావేశం నిర్వహించింది. దీనికి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే గైర్హాజయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కానుందనే ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది.


కాగా, మకర సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ నుంచి వలసలు ఉంటాయని, ఆ పార్టీ ఎమ్మెలంతా ఎన్డీయేలో చేరే అవకాశం ఉందని నితీశ్ క్యాబినెట్‌లో ఎల్‌జేపీ మంత్రి సంజయ్ సింగ్ తెలిపారు. అయితే ఈ ఊహాగానాలకు బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్ తోసిపుచ్చారు. ఎన్డీయే నేతలు వదంతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.


మళ్లీ పెద్దన్నగా జేడీయూ

నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ ఇటీవల 85 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ఎన్డీయే పెద్దన్నగా జేడీయూ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు జేడీయూకు మద్దతుగా నిలిస్తే ఆ పార్టీ సంఖ్యాబలం 91కి చేరుతుంది. ఇదే జరిగితే ఎన్డీయే పెద్దన్న క్రెటిడ్‌ను జేడీయూ తిరిగి దక్కించుకుంటుంది.


ఇవి కూడా చదవండి..

విజయ్ జననాయగన్ వాయిదాపై రాహుల్ ట్వీట్.. మోదీపై విమర్శలు

భూతల దాడులకు కూడా సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2026 | 09:45 PM