ఛత్రోంకీ గూంజ్‌తో దేశవ్యాప్త కార్యక్రమం: కాంగ్రెస్ పార్టీ
ABN , Publish Date - Jun 24 , 2026 | 09:58 AM
దేశ విద్యావ్యవస్థలోని సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఛత్రోం కీ గూంజ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జూన్ 25వ తేదీన దేశంలోని 28 ప్రధాన నగరాల్లో ప్రత్యేక మీడియా సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
న్యూఢిల్లీ, జూన్ 24: దేశ విద్యావ్యవస్థలోని సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఛత్రోం కీ గూంజ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జూన్ 25వ తేదీన దేశంలోని 28 ప్రధాన నగరాల్లో ప్రత్యేక మీడియా సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నీట్ ప్రశ్న పత్రం లీక్ అంశంలో కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. గత 12 ఏళ్లుగా విద్యారంగంలో ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, భావజాల ఆధిపత్యానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
దేశంలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో పాటు యువతలో ఉపాధి సామర్థ్య లోపం (Employability Crisis) కూడా తీవ్రమైందని ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యారంగంపై ఆసక్తి ఉన్న పౌరులందరినీ ఈ జాతీయ చర్చలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది.
హైదరాబాద్‌లో ఛత్రోంకి గూంజ్ కార్యక్రమంలో పార్టీ నేత విక్రాంత్ భూరియా పాల్గొంటారని తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో జరిగే సమావేశాల్లో గౌరవ్ గోగోయ్, పవన్ ఖేరా, కన్హయ్య కుమార్, సుప్రియా శ్రీనేట్ తదితర సీనియర్ నేతలు పాల్గొంటారని వివరించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె. సి. వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
మరో వైపు విద్యావ్యవస్థలోని సమస్యల పరిష్కారానికి విద్యార్థుల స్వరాన్ని ప్రభుత్వానికి చేరవేసే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఛాత్రోం కీ గూంజ్ పేరుతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గత వారం ప్రారంభించిన విషయం విదితమే.
ఈ వార్తలనూ చదవండి:
ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
గోల్డ్ రేట్స్.. భారీగా తగ్గిన ధరలు
For More National News And Telugu News