Share News

రేపిస్టులను సమర్థించే వ్యక్తి ప్రహ్లాద్‌ జోషి!

ABN , Publish Date - Jul 29 , 2026 | 07:09 AM

కొత్త విద్యా మంత్రిపై కాంగ్రెస్‌ చేసిన వ్యాఖ్యలతో మంగళవారం లోక్‌సభ దద్దరిల్లింది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా నేపథ్యంలో విద్యాశాఖను కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి అప్పగించడంపై ఏఐసీసీ అగ్రనేతలు ప్రియాంక, రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు.

రేపిస్టులను సమర్థించే వ్యక్తి ప్రహ్లాద్‌ జోషి!

  • ఆయన్ని ప్రధాని కొత్త విద్యామంత్రిగా ఎంచుకున్నారు

  • కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక ఆరోపణ

  • తీవ్రంగా మండిపడిన ప్రహ్లాద్‌ జోషి, కిరణ్‌రిజిజు

  • ఆధారాలతో నిరూపించాలంటూ సవాల్‌

  • ‘లీకేజీల’ బిల్లుపై విపక్షాల విమర్శలు.. సభలో దుమారం

న్యూఢిల్లీ, జూలై 28: కొత్త విద్యా మంత్రిపై కాంగ్రెస్‌ చేసిన వ్యాఖ్యలతో మంగళవారం లోక్‌సభ దద్దరిల్లింది. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా నేపథ్యంలో విద్యాశాఖను కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి అప్పగించడంపై ఏఐసీసీ అగ్రనేతలు ప్రియాంక, రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. ప్రహ్లాద్‌ జోషి ఇటీవల రేపిస్టులను వెనకేసుకొచ్చారని, అలాంటి వ్యక్తికి ప్రధాని మోదీ విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారనిఆరోపించారు. గతంలో బిల్కిస్‌ బానోపై అత్యాచారం కేసులో శిక్షపడిన దోషుల విడుదలపై ప్రహ్లాద్‌ జోషి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘విడుదల చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే జరిగింది. అందులో తప్పేమీ లేదని భావిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై తాజాగా లోక్‌సభలో ప్రశ్నపత్రాల లీకేజీ నిరోధక బిల్లుపై చర్చ సందర్భంగా ప్రియాంక, రాహుల్‌ వివాదం లేవెనెత్తారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఆమె ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని సవాల్‌ చేశారు. ప్రియాంక క్షమాపణలు చెప్పాలని, లేకుంటే సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌ను కోరారు. దీనిపై ప్రియాంకా గాంధీ దీటుగా స్పందించారు. ప్రహ్లాద్‌ జోషి చేసిన వ్యాఖ్యల వీడియో తమ వద్ద ఉందని, ఆధారాలన్నింటినీ సభకు సమర్పిస్తానని చెప్పారు. ఇక రాహుల్‌ గాంధీ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మోదీ క్యాబినెట్‌లో ఎందరో మంత్రులు ఉన్నారు. అందులో ఎవరికైనా విద్యాశాఖ బాధ్యత ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇలా అత్యాచార నేరస్తులను సమర్థించే వ్యక్తిని ఎంచుకోవడం ఆశ్చర్యకరం’’ అన్నారు.


ఇక పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ నిరోధక బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాల నేతలు కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘జెన్‌ జీని ఆకట్టుకోవడానికి మోదీ వీడియోలలో యాంగిల్స్‌ను మార్చడం వల్ల ప్రయోజనం లేదు. ఆయన తన మనసు మార్చుకోవాలి’’ అని ప్రియాంక పేర్కొన్నారు. పేపర్‌ లీకేజీల నియంత్రణకు కేంద్రం నియమించిన హైపవర్డ్‌ కమిటీలో గోమూత్ర నిపుణుడిని నియమించారంటూ ఐఐటీ మద్రా్‌సకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త వి.కామకోటిని ఉద్దేశించి విమర్శలు చేశారు. గోమూత్రానికి బ్యాక్టీరియాలను, ఫంగ్‌సను నిరోధించే శక్తి ఉంటుందని ఆయన గతంలో అన్నారు.

Updated Date - Jul 29 , 2026 | 08:26 AM