Share News

నామినేషన్ వేసిన కేరళ సీఎం పినరయి విజయన్

ABN , Publish Date - Mar 19 , 2026 | 01:23 PM

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. సీపీఎం వెటరన్ నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూరు జిల్లా ధర్మదం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారంనాడు నామినేషన్ వేశారు.

నామినేషన్ వేసిన కేరళ సీఎం పినరయి విజయన్
Pinarayi Vijayan

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. సీపీఎం వెటరన్ నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) కన్నూరు జిల్లా ధర్మదం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారంనాడు నామినేషన్ వేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో తలస్సేరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సీఎం చేరుకున్నారు. ఆయనకు కన్నూరు రిజిస్ట్రార్ ఎబీ సత్యన్ స్వాగతం పలికారు. అనంతరం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి పినరయి విజయన్ అందజేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శి కేకే రఘేష్, సీనియర్ నేతలు ఈపీ జయరాజన్, అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ షంసీర్, పొలిటికల్ సెక్రటరీ పి.శశి తదితరులు హాజరయ్యారు.


ఎనభై ఏళ్ల పినరయి విజయన్ తన రాజకీయ జీవితంలో ఏడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ధర్మదం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటం ఇది మూడోసారి. 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అంతకుముందు మూడుసార్లు కుతుపరంబ నియోజకవర్గానికి, ఒకసారి పయ్యన్నూరు నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.


కాగా, పినరయి విజయన్‌పై అబ్దుల్ రషీద్‌ను కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ పోటీకి నిలిపింది. బీజేపీ తమ అభ్యర్థిగా కె.రంజిత్‌ను నిలబెట్టింది. దీంతో ధర్మదం నియోజకవర్గంలో కీలకంగా త్రిముఖ పోటీ నెలకొంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఏప్రిల్ 9న జరుగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి. కేరళ ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం మే 23తో ముగియనుంది.


ఇవి కూడా చదవండి..

విజయాల ఉగాది.. దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

సోషల్‌ మీడియా నియంత్రణపై మరిన్ని కేంద్రప్రభుత్వ శాఖలకు అధికారం

Updated Date - Mar 19 , 2026 | 01:26 PM