Share News

న్యాయవేదికను ప్రచారానికి వాడుకుంటున్నారా.. ప్రశాంత్‌ కిశోర్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - Feb 06 , 2026 | 02:59 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు కొట్టివేసింది.

న్యాయవేదికను ప్రచారానికి వాడుకుంటున్నారా.. ప్రశాంత్‌ కిశోర్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Supreme court on Prashant Kishor petition

న్యూఢిల్లీ: గత ఏడాది నవంబర్‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారంనాడు కొట్టివేసింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.


అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జనతా దళ్ (యునైటెడ్), భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందని ప్రశాంత్ కిశోర్ తమ పిటిషన్‌లో ఆరోపించారు. ఓటింగ్‌కు ముందు మహిళా ఉపాధి పథకం కింద లబ్ధిదారులైన ఒక్కో మహిళకు రూ.10 వేలు పంపిణీ చేశారని, ఇది ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసిందని అన్నారు. కూటమి గెలుపు చెల్లదని ప్రకటించాల్సిందిగా కోర్టును కోరారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన జన్‌సురాజ్ పార్టీ 238 స్థానాల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. కాగా, ప్రశాంత్ కిశోర్ పిటిషన్‌పై విచారణకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని ధర్మాసనం నిరాకరించింది. 'మీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? ప్రజలే మీ పార్టీని వద్దనుకున్నారు. ఇప్పుడు ప్రచారం కోసం ఈ న్యాయవేదికను వాడుకోవాలనుకుంటున్నారా?' అని సీజేఐ ప్రశ్నించారు.


ఎన్నికల్లో ఓడిపోయినందున మొత్తం ఫలితాన్ని పక్కన పెట్టాలని మీరు కోరుతున్నారని, దీనిపై హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశాంత్ కిషోర్ న్యాయవాదులను ధర్మాసనం నిలదీసింది. 'ఇదేమీ పాన్-ఇండియా అంశం కాదు. మీ రాష్ట్రంలో హైకోర్టు ఉంది. ఏమైనా ఫిర్యాదులు ఉంటే అక్కడికి వెళ్లండి' అని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి..

దళపతి విజయ్‌కి షాక్ ఇచ్చిన కోర్టు.. ఆ పిటిషన్ కొట్టివేత

గడ్చిరోలిలో కాల్పుల కలకలం.. ముగ్గురు మావోయిస్టుల మృతి

Updated Date - Feb 06 , 2026 | 03:02 PM