పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026 డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
ABN , Publish Date - Jul 25 , 2026 | 01:56 PM
దేశంలో నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.. 'పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026' డ్రాఫ్ట్ విడుదల చేసింది.
ఢిల్లీ, జులై 25: దేశంలో నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సత్వర అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ(శనివారం) 'పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026' డ్రాఫ్ట్‌ను కేంద్రం విడుదల చేసింది. ఈ కీలక సవరణ బిల్లును రేపు (ఆదివారం) లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పరీక్షల వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, ముఠాల అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ చట్టంలో అత్యంత కఠినమైన నిబంధనలను పొందుపరిచారు.
చట్టంలోని కీలక ముఖ్యాంశాలు.. కఠిన చర్యలు
పరీక్షల్లో సాధారణ మోసాలు, అక్రమాలకు పాల్పడితే విధించే జైలు శిక్షను 5 నుంచి 10 ఏళ్లకు పెంచారు. దాంతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలు (Organized Gangs) గ్యాంగ్‌లకు గరిష్ఠంగా రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా ప్రతిపాదనలు చేశారు. పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు లేదా సర్వీస్ ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడితే రూ. 5 కోట్ల జరిమానా విధిస్తారు. అక్రమాలకు పాల్పడిన సంస్థలను 8 ఏళ్ల పాటు బ్లాక్‌లిస్ట్‌లో ఉంచుతారు.
కేసు నమోదైన 2 నెలల లోపే సమగ్ర విచారణ పూర్తి చేయడం తప్పనిసరి. కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఛార్జ్‌షీట్ దాఖలైన 3 నెలల వ్యవధిలోనే కోర్టు విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. తీర్పులపై అప్పీళ్లను హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ మాత్రమే విచారిస్తుంది. ఈ అప్పీళ్లను కూడా 3 నెలల్లోపు పరిష్కరించాలని స్పష్టమైన నిబంధన విధించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు