పొగమంచు సీజన్ నేపథ్యంలో విమానయాన సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 28 , 2026 | 08:26 AM
పొగమంచు సీజన్ రానున్న నేపథ్యంలో విమాన సర్వీసులకు అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విమానయాన సంస్థలను కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశించింది. లో విజిబిలిటీలో విమానాలు నడపగల అర్హత ఉన్న సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా విమానాలు ఉండేలా చూడాలని ఆ శాఖ సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: పొగమంచు సీజన్ రానున్న నేపథ్యంలో విమాన సర్వీసులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విమానయాన సంస్థలను కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశించింది. లో విజిబిలిటీలో విమానాలు నడపగల అర్హత ఉన్న సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా విమానాలు ఉండేలా చూడాలని ఆ శాఖ సూచించింది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విమాన షెడ్యూళ్లను రూపొందించాలని పేర్కొంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనాల ప్రకారం డిసెంబరు 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు పొగమంచు సీజన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం పౌర విమానయాన శాఖ.. వివిధ విభాగాల అధికారులు, విమానయాన రంగ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించింది. విమానాల ఆలస్యం, రద్దు, సమయాల మార్పు వంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.
విమానయాన సంస్థలు తమ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలని, లగేజీ నిర్వహణను సమర్థంగా చేపట్టాలని, విమానాల టర్న్ అరౌండ్ ప్రక్రియను వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ సూచించింది. విమాన కార్యకలాపాల్లో అంతరాయాలు ఏర్పడినప్పుడు ప్రయాణికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించింది. అలాగే విమానాల రద్దు, ఆలస్యం, బయలుదేరే సమయాల్లో మార్పులపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఎస్‌ఎంఎస్, మొబైల్ యాప్‌లు, ఈ-మెయిల్ వంటి మార్గాలను వినియోగించాలని సూచించింది.
విమానయాన సంస్థలు నిబంధనలను పాటిస్తున్నాయో లేదో పర్యవేక్షించడంతో పాటు విమానాలు, సిబ్బంది సంసిద్ధతను తనిఖీ చేయాలని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కు మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రయాణికులకు తగిన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక లో విజిబిలిటీ పరిస్థితుల్లో విమానాశ్రయాల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ), విమానాశ్రయ నిర్వాహకులకు మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్‌ఎస్), రన్‌వే విజువల్ రేంజ్ (ఆర్‌వీఆర్) వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, విమానాశ్రయ ప్రాంగణంలో భద్రత, టెర్మినల్ సామర్థ్యం, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచాలని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య
రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు