Share News

రాజకీయాలను చొప్పించొద్దు

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:21 AM

స్థానిక ఎన్నికల ప్రక్రియకు సర్వోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది

రాజకీయాలను చొప్పించొద్దు
Supreme Court

  • ఎన్నికలు వాయిదా వేయాలన్న మీ ట్రాప్‌లో పడబోం

  • ఏదైనా ఉంటే క్షేత్రస్థాయిలోనే తేల్చుకోండి

  • వైసీపీపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

  • స్థానిక ఎన్నికలకు ధర్మాసనం పచ్చజెండా

  • నామినేషన్ల గడువు ముగిసింది..

  • ఇక ఎన్నికల్లో పోటీ చేయాలని వ్యాఖ్య

  • ప్రక్రియలో జోక్యానికి నిరాకరణ

  • ఎన్నికల పిటిషన్లు వేసుకోవాలని

  • ‘బాధితుల’కు సూచన

  • ఫుటేజీల్ని భద్రపరచాలని ఆదేశం

న్యూఢిల్లీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల ప్రక్రియకు సర్వోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. నామినేషన్ల గడువు పొడిగించాలన్న వైసీపీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. వైసీపీ తరఫున సీనియర్‌ న్యాయవాదులు మణిందర్‌ సింగ్‌, నిరంజన్‌ రెడ్డి (వైసీపీ ఎంపీ) కోర్టుకు హాజరయ్యారు. రాజకీయాలను ఇందులో చొప్పించొద్దని, ఏదైనా ఉంటే అక్కడే (క్షేత్రస్థాయిలో) తేల్చుకోవాలని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎన్నికలు వాయిదా వేయాలన్న మీ ట్రాప్‌లో పడబో’’మని వ్యాఖ్యానించింది. నామినేషన్ల గడువు ముగిసినందున, ఎన్నికల్లో పోటీ చేయండి అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో స్థానిక ఎన్నికల వ్యవహారంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణల కారణంగా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం ఊహాజనిత ఆరోపణలు, వివాదాస్పదమైన అంశాల ఆధారంగా సుదీర్ఘ విచారణలకు ఆదేశించలేమని తేల్చిచెప్పింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో, ఎలాంటి ప్రత్యేక విచారణకూ ఆదేశించలేమని, అయితే బాధితులు ఎన్నికల పిటిషన్ల ద్వారా తగిన పరిష్కారాలు పొందవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తగిన సమయంలో ఈ ఫిర్యాదులను పరిశీలించేందుకు వీలుగా నామినేషన్ల కేంద్రాల వద్ద సీసీటీవీ ఫుటేజీలు, రికార్డింగ్‌లను భద్రపరచాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్‌ఈసీ) ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.


ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే అభ్యంతరాలను పరిశీలించి, కొన్నిచోట్ల గడువు పొడిగించిందని ధర్మాసనం గుర్తుచేసింది. అనుకూల నిర్ణయం వచ్చిన అభ్యర్థులు నామినేషన్లు వేశారని పేర్కొంది. అయితే, పెద్ద సంఖ్యలో వినతులను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, కానీ.. కేవలం ఊహాజనిత ఆరోపణలు, సామూహిక వ్యాఖ్యల ఆధారంగా ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

లోతైన విచారణకు ఆదేశించలేం

వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలపై లోతైన (ఫిషింగ్‌ లేదా రోవింగ్‌) విచారణకు ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అభ్యర్థులను అన్యాయంగా నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వివాదాస్పదమైనవని, ప్రస్తుత విచారణలో వాటిని పరిష్కరించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘మేం ఎలాంటి లోతైన విచారణకూ ఆదేశించలేం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అనుసరించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేస్తాం.’’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజీ భద్రపరచడంతోపాటు ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేసే అంశం పరిశీలిస్తామని కోర్టు వెల్లడించింది. ఎస్‌ఈసీ ఫిర్యాదులపై స్పందించి కొన్ని కేసుల్లో నామినేషన్ల గడువును పొడిగించిందని ధర్మాసనం గమనించింది. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించే అభ్యర్థులు ఆ విషయాన్ని కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ‘‘ఇవి వివాదాస్పదమైన అంశాలు’’ అని బెంచ్‌ పేర్కొంది.


స్పష్టత లేని అంశంలో కలుగజేసుకోలేం

వైసీపీ తరఫునసీనియర్‌ న్యాయవాది మణిందర్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. అధికారులను ఆశ్రయించినప్పటికీ పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని తెలిపారు. ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దాదాపు 1,200 మంది అభ్యర్థులకు సంబంధించి వచ్చిన ఆరోపణలను ప్రస్తావించారు. అయితే, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలను వ్యక్తిగతంగా పరిశీలించలేమని ధర్మాసనం తేల్చేసింది. ‘స్పష్టత లేని ఈ అంశంలో కలుగజేసుకోలేం’అని వ్యాఖ్యానించింది. బాధితులు ఎన్నికల పిటిషన్ల ద్వారా తగిన పరిష్కారాలు పొందవచ్చని సూచించింది.


వ్యక్తిగత ఫిర్యాదులను

స్వీకరిస్తూ పోతే అనిశ్చితే: లూథ్రా

రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థఽ లూథ్రా వాదనలు వినిపించారు. వ్యక్తిగత ఫిర్యాదులను స్వీకరిస్తూ పోతే ఎన్నికల ప్రక్రియలోనే అనిశ్చితి ఏర్పడుతుందన్నారు. ఎన్నికల సంఘం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలపై పదేపదే పిటిషన్లు దాఖలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తగిన సమయంలో ఈ ఫిర్యాదులను పరిశీలించేందుకు వీలుగా సీసీటీవీ రికార్డింగ్‌లను భద్రపరచాలని ధర్మాసనం సూచించింది. పంజాబ్‌ ఎన్నికల కేసు తరహాలోనే ఇక్కడ కూడా ఉత్తర్వులు ఇవ్వాలని వైసీపీ తరఫు న్యాయవాది మణిందర్‌ సింగ్‌ కోరారు. ‘‘పంజాబ్‌ కేసులో ధర్మాసనం విశ్రాంత న్యాయమూర్తిని నియమించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక్కడి పరిస్థితులు అంతకంటే దారుణంగా ఉన్నాయి. ఒకే నోటిఫికేషన్‌ కింద జెడ్పీటీసీ సహా రెండో విడత ఎన్నికల్లో దాదాపు 1,600 మంది అభ్యర్థులకు గాను 1,200 మందిని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్‌ కేసు విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలి.’’ అని విజ్ఞప్తి చేశారు. దీనికి లూథ్రా బదులిస్తూ, పంజాబ్‌ కేసు పరిస్థితులు వేరని వాదించారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చిన పాత తీర్పులు వేరని, ఎన్నికల ప్రక్రియ పరిరక్షణకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేస్తామని సీజేఐ తెలిపారు. వైసీపీ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించారు

ఇవి కూడా చదవండి..

భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య

రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు

Updated Date - Oct 28 , 2026 | 06:24 AM