రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు..
ABN , Publish Date - Oct 27 , 2026 | 07:38 PM
దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నవంబర్ 1న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఈ సభకు సంబంధించి పలు నిబంధనలు విధించారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నవంబర్ 1న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఈ సభకు సంబంధించి పలు నిబంధనలు విధించారు. సభ సాయంత్రం 5 గంటల్లోగా ముగించాలని, రామ్లీలా మైదానంలో రాత్రి ఎవరూ బస చేయకూడదని స్పష్టం చేశారు. సీసీటీవీ కెమెరాలు, తాగునీరు, మరుగుదొడ్లు, స్వచ్ఛంద సేవకుల ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలని నిర్వాహకులకు సూచించారు (Congress rally).
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్), ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది (Ramlila Maidan rally).
రామ్లీలా మైదానంలో సభ నిర్వహణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే మైదానం యాజమాన్య సంస్థ నుంచి అవసరమైన అనుమతి పొందడంతో పాటు, పోలీసుల నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. సభను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించాలి. కార్యక్రమం ముగిసిన వెంటనే సభకు వచ్చినవారు మైదానం నుంచి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేయాలి. సభకు ముందు, సభ సమయంలో లేదా అనంతరం ఎవరూ అక్కడ రాత్రి బస చేయడానికి వీల్లేదు (INDIA bloc rally).
సభలో భద్రతను పర్యవేక్షించేందుకు కీలక ప్రదేశాల వద్ద హైడెఫినిషన్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు ఆదేశించారు (SIR controversy). ప్రజల మధ్య విద్వేషాలు, ఉద్రిక్తతలు సృష్టించే ప్రసంగాలు చేయకూడదు. ఎవరైనా రెచ్చగొట్టే లేదా బెదిరింపు వ్యాఖ్యలు చేస్తే, నిర్వాహకులు వెంటనే మైకులు నిలిపివేసి సంబంధిత వ్యక్తిని వేదిక నుంచి తొలగించాల్సి ఉంటుంది. రామ్లీలా మైదానం నుంచి మరే ఇతర ప్రాంతానికీ ఊరేగింపుగా వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
చైనా చొరబాటు అంటూ తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: కిరణ్ రిజిజు
అమెరికా భారీ సైనిక ప్రణాళిక.. భారీ యుద్ధం వచ్చినా 90 రోజులు పనిచేసేలా..