Share News

అమెరికా భారీ సైనిక ప్రణాళిక.. భారీ యుద్ధం వచ్చినా 90 రోజులు పనిచేసేలా..

ABN , Publish Date - Oct 27 , 2026 | 03:35 PM

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, భద్రతాపరమైన సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా కీలక రక్షణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

అమెరికా భారీ సైనిక ప్రణాళిక.. భారీ యుద్ధం వచ్చినా 90 రోజులు పనిచేసేలా..
US military preparedness

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, భద్రతాపరమైన సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా కీలక రక్షణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. భారీ యుద్ధం సంభవించి దేశంలోని సాధారణ విద్యుత్, నీటి సరఫరా, ఇంధన వ్యవస్థలు దెబ్బతిన్నా.. తమ సైనిక స్థావరాలు కనీసం 90 రోజులపాటు స్వతంత్రంగా పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది. ఈ ప్రణాళికకు ఫోర్ట్రెస్ (FORTRESS) అని పేరు పెట్టింది (US FORTRESS plan).


పౌర మౌలిక సదుపాయాలపై ఆధారపడి సైనిక స్థావరాల కార్యకలాపాలు సాగకుండా, స్వతంత్రంగా పని చేసేలా ఏర్పాట్లు చేయడమే ఈ ఫోర్ట్రెస్ ప్రణాళిక లక్ష్యం. సైనిక స్థావరాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆయుధాల నిర్వహణ, రవాణా, సైనికుల అవసరాలు, ఇతర కీలక కార్యకలాపాలు నిరంతరాయంగా సాగాలంటే విద్యుత్ ఎంతో అవసరం. అయితే భారీ యుద్ధం జరిగితే విద్యుత్ సరఫరా వ్యవస్థలు, రవాణా మార్గాలు, సరఫరా గొలుసులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బయటి నుంచి విద్యుత్, నీరు, ఇంధనం అందకపోయినా స్థావరాలు పనిచేసేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అమెరికా రక్షణ శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది (US military preparedness).


ఫోర్ట్రెస్ ప్రణాళికలో భాగంగా పోర్టబుల్ అణు రియాక్టర్లు, భారీ బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, మైక్రోగ్రిడ్లను ఉపయోగించనున్నారు. మైక్రోగ్రిడ్లు అంటే ప్రధాన విద్యుత్ గ్రిడ్‌తో సంబంధం తెగిపోయినా స్వతంత్రంగా విద్యుత్ సరఫరా చేయగల చిన్న విద్యుత్ వ్యవస్థలు. బయటి విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాల్లోనూ వీటి ద్వారా సైనిక స్థావరాలకు విద్యుత్తును అందించవచ్చు. అదేవిధంగా కనీసం 90 రోజులకు సరిపడా నీరు, ఇంధనం, సమాచార వ్యవస్థలను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయనున్నారు (Military base security).


అలాగే కొన్ని కర్మాగారాలను రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తుల తయారీకి కేటాయించాలని భావిస్తున్నారు (US defence strategy). యుద్ధ సమయంలో ఆయుధాలు, సైనిక పరికరాలు, ఇతర కీలక సామగ్రి సరఫరా కొనసాగించేందుకు వీటిని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఈ ఫోర్ట్రెస్ ప్రణాళికకు సంబంధించిన పూర్తి అమలు వివరాలు, ఖర్చు, ప్రతి స్థావరంలో ఏర్పాట్లపై పూర్తి సమాచారం బయటకు రావాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి...

‘ప్రాణనష్టం జరగకుండా చూడాలి’.. ఆర్నబ్ తుఫాన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు

‘మీరు 2.O చూపిస్తే.. మేం 10X చూపిస్తాం’.. జగన్‌కు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్

Updated Date - Oct 27 , 2026 | 03:35 PM