Share News

అస్సాం వరద మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల ఎక్స్‌గ్రేషియా

ABN , Publish Date - Jul 29 , 2026 | 09:49 AM

అస్సాం వరద ప్రాంతాల్లో ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం పర్యటించింది. వరద తీవ్రత, నష్టాన్ని అంచనావేసింది. శివసాగర్ జిల్లాలో మరో ఏడుగురు మృతి చెందడంతో అస్సాం వరదల కారణంగా చనిపోయిన మొత్తం మృతుల సంఖ్య 75కు పెరిగింది.

అస్సాం వరద మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల ఎక్స్‌గ్రేషియా

గోలాఘాట్ (అస్సాం), జూలై 29: అస్సాంలో సంభవించిన భారీ వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. రాష్ట్రంలో నెలకొన్న ముంపు పరిస్థితి.. ఆస్తి, పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) జాయింట్ సెక్రటరీ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం నిన్న గోలాఘాట్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, జిల్లా యంత్రాంగంతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించింది.


కేంద్ర బృందం పర్యటన అనంతరం అస్సాం రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కేశవ్ మహంత మీడియాతో వివరాలు వెల్లడించారు. 'కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంపిన వివిధ శాఖల బృందం క్షేత్రస్థాయి వరద పరిస్థితులను సమీక్షించింది. జిల్లా యంత్రాంగం అందించిన వివరాలు, కేంద్ర బృందం తయారుచేసే నివేదిక ఆధారంగా అస్సాం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన ఆర్థిక సహాయం అందుతుంది' అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


75కు చేరిన మృతుల సంఖ్య

రాష్ట్రంలో వరద ముప్పు రోజురోజుకూ తీవ్రమవుతోంది. డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (DRIMS) నిన్నటికి (జూలై 28)వెలువరించిన నివేదిక ప్రకారం.. శివసాగర్ జిల్లాలో నీట మునిగి మరో ఏడుగురు మృతి చెందడంతో, మొత్తం మరణాల సంఖ్య 75కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 7 జిల్లాలు (శివసాగర్, చరాయిదేవ్, గోలాఘాట్, జోర్‌హాట్, నగావ్, సోనిత్‌పూర్, కామ్‌రూప్) వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 21 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 622 గ్రామాలకు చెందిన 3,32,639 మంది ప్రజలు ఈ వరదల బారిన పడ్డారు. నుమాలిగఢ్ వద్ద ధన్సిరి నది ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది.


45,000 హెక్టార్ల పంట నీటిపాలు

వరదల వల్ల వ్యవసాయ రంగానికి భారీ గండి పడింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45,341.98 హెక్టార్ల విస్తీర్ణంలో పంట పొలాలు నీట మునిగిపోయాయి. దీనివల్ల వేలాది మంది రైతులు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు.


బాధితులకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించిన సీఎం హిమంత బిస్వా శర్మ

వరద బాధితులను ఆదుకునేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పలు కీలక ఉపశమన చర్యలు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల పరిహారం ప్రకటించారు. సాధారణ ఎక్స్‌గ్రేషియా రూ.4 లక్షలు అందించడానికి పోస్ట్‌మార్టం నిబంధనను మినహాయించారు. దీనికి అదనంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి మరో రూ.5 లక్షలు కలిపి, మొత్తం రూ.9 లక్షల పరిహారం అందించనున్నారు. 30 రోజులకు పైగా ఆచూకీ లేని వారి కుటుంబాలకు కూడా రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తారు.


తక్షణ నగదు సాయం 'ఒరునోడోయ్' స్కీమ్

వరదల వల్ల ఇళ్లు కోల్పోయిన లక్ష కంటే ఎక్కువ కుటుంబాలకు అత్యవసర ఖర్చుల కోసం రూ.15,000 నగదు సాయం అందించనున్నారు. ఆగస్టు 1 నుంచి ప్రాచుర్యం పొందిన 'ఒరునోడోయ్' (Orunodoi) పథకం తిరిగి ప్రారంభించి, ప్రభావిత జిల్లాల లబ్ధిదారులకు ఆగస్టు నెలకు గాను రూ. 2,500 ప్రత్యేక విడతగా జమ చేయనున్నారు.


విద్యార్థులకు పుస్తక గ్రాంట్లు, రవాణా సాయం

ఆగస్టు 1 నుంచి తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల విద్యార్థులకు ప్రత్యేక పుస్తక గ్రాంట్లు అందుతాయి. హైస్కూల్ విద్యార్థులకు రూ.1,000 నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 5,000 వరకు సహాయం అందిస్తారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, పాఠశాల యూనిఫాంలతో పాటు, వరదల్లో పోగొట్టుకున్న 10వ, 12వ తరగతి మార్కుల జాబితాలు (Mark Sheets), సర్టిఫికెట్లను ఉచితంగా తిరిగి జారీ చేయనున్నారు.


వరదలతో అతలాకుతలమైన అస్సాంకు కేంద్రం అందించే నివేదిక ఆధారంగా త్వరలోనే మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.9 లక్షల పరిహారం, రూ.15,000 తక్షణ సాయం బాధితులకు కొంత ఊరటనివ్వనున్నాయి. కాగా, ఇప్పటికే అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆర్గనైజేషన్లు వరద ప్రాంతాల్లో ఆహారం, దుస్తులు, మందులు, తదితర సహాయ సామాగ్రిని భారీగా పంపిణీ చేస్తున్నాయి. బాధిత కుటుంబాల్ని తమ వంతుగా ఆదుకుంటున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

బొండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన అధిష్ఠానం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 10:51 AM