Share News

డిజిటల్ అరెస్ట్ సైబర్ ముఠాలపై విరుచుకుపడ్డ సీబీఐ

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:20 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' సైబర్ నేరాలపై CBI ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ చక్ర-VI'లో భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టి ముగ్గుర్ని అరెస్ట్ చేసింది.

డిజిటల్ అరెస్ట్ సైబర్ ముఠాలపై విరుచుకుపడ్డ సీబీఐ
CBI Raids 89 Locations in 20 States Over Digital Arrest Cases

ఢిల్లీ, సెప్టెంబర్ 4: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' సైబర్ నేరాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఉక్కుపాదం మోపింది. 'ఆపరేషన్ చక్ర-VI' (Operation Chakra-VI) లో భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టింది. సైబర్ బాధితుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును స్వీకరించడం, దారి మళ్లించడం, పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు నిందితులను సీబీఐ పోలీసులు అరెస్ట్ చేశారు.


పోలీసులు, ప్రభుత్వ అధికారులమని చెప్పి నకిలీ గుర్తింపు కార్డులు చూపి జనాల్ని డిజిటల్ అరెస్టులు చేస్తూ ఈ సైబర్ ముఠాలు అనేక అరాచకాలకు పాల్పడుతున్నాయి. బాధితుల్ని భయభ్రాంతులకు గురిచేసి వారి నుంచి కోట్లాది రూపాయలు గుంజుతున్నాయి. ఈ ముఠాలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ తాజా తనిఖీలు చేపట్టింది. కాగా, వివిధ రాష్ట్రాల నుంచి సీబీఐ స్వీకరించిన మూడు కీలక డిజిటల్ అరెస్ట్ కేసుల్లో బాధితులను నెలల తరబడి డిజిటల్‌గా బంధించి, మొత్తం రూ. 42.36 కోట్లు దండుకున్నారు.

1. బిట్స్ పిలానీ (BITS Pilani) కేసు: బాధితుడిని మూడు నెలల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి, రూ. 7.67 కోట్లు కాజేశారు.

2. గుజరాత్ కేసు: పోలీసుల పేరిట నమ్మించి, ఒక వ్యక్తిని మూడు నెలలు డిజిటల్‌గా బంధించి ఏకంగా రూ. 19.24 కోట్లు వసూలు చేశారు.

3. కర్ణాటక కేసు: బాధితుడిని నెల రోజుల పాటు భయాందోళనకు గురిచేసి రూ. 15.45 కోట్లు దోచుకున్నారు.

20 రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు

ఫైనాన్షియల్, సాంకేతిక సమాచారాన్ని, బ్యాంకు ఖాతాల డేటాను విశ్లేషించిన తర్వాత సీబీఐ 89 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో బ్యాంకు రికార్డులు, డిజిటల్ డివైజ్‌లు, కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఈ నగదు ఎక్కడెక్కడికి మళ్లిందో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ వ్యవహారాలకు సంబంధించి హ్యాండ్లింగ్, మనీ లాండరింగ్‌లో పాల్గొన్న ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది.


చిక్కిన ముగ్గురు సూత్రధారులు

ఆకాష్ (హర్యానా): ఇతని ఖాతాలోకి రూ. 1.95 కోట్లు రాగా, అదే రోజు ఆ డబ్బును ఇతర ఖాతాలకు మళ్లించాడు.

రాజా కర్మాకర్ (కోల్‌కతా): ఇతని కంపెనీ ఖాతాలోకి రూ. 1.5 కోట్ల మోసం సొమ్ము జమ అయింది.

జ్యోతి రాణి: ఈమె తన ఖాతాలోకి వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని నగదు రూపంలో విత్‌డ్రా చేసి, మిగిలిన మొత్తాన్ని ఇతర ఖాతాలకు పంపిణీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు

ఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ నారాయణన్

For More National News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 04:50 PM