ఢిల్లీ లిక్కర్ కేసులో ‘సౌత్ గ్రూప్’ పేరుపై సీబీఐ కోర్టు తీవ్ర అభ్యంతరం
ABN , Publish Date - Feb 27 , 2026 | 02:29 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో ‘సౌత్ గ్రూప్’ పేరుపై సీబీఐ కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. లిక్కర్ కేసులో కొంతమంది నిందితులను వారి ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని ‘సౌత్ గ్రూప్’ అని పిలవడం సరైన పద్ధతి కాదని న్యాయస్థానం హెచ్చరించింది.
ఢిల్లీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) ‘సౌత్ గ్రూప్’ (South Group) పేరుపై సీబీఐ కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. లిక్కర్ కేసులో కొంతమంది నిందితులను వారి ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని ‘సౌత్ గ్రూప్’ అని పిలవడం సరైన పద్ధతి కాదని న్యాయస్థానం హెచ్చరించింది. ‘సౌత్ గ్రూప్’ అనే పదానికి చట్టంలో ఎలాంటి ఆధారం లేదని స్పష్టం చేసింది. నేరం నిరూపించడానికి ప్రాంతం లేదా వారు ఎక్కడి వాళ్లు అన్నది సంబంధం లేదని తేల్చిచెప్పింది. మరి మిగతా నిందితులను ‘నార్త్ గ్రూప్’ (North Group) అని ఎందుకు పేరు పెట్టలేదని... ఇది ఒకపక్షపాతంగా కనిపిస్తోందని మందలించింది.
ప్రాంతం ఆధారంగా ఇలా పిలవడం వల్ల ప్రజల్లో, కోర్టులో కూడా ఒక తప్పుడు భావన కలుగుతుందని సీబీఐ కోర్టు అభిప్రాయపడింది. క్రిమినల్ కేసులు వ్యక్తి చేసిన పనిపై ఆధారపడి ఉండాలని, అతను ఎవరు..?, ఎక్కడి వాళ్లు,? అన్నవిషయంపై కాదని స్పష్టం చేసింది. నిందితుడిని అతని చర్యల ఆధారంగా మాత్రమే విచారించాలని సూచించింది. అతని జాతి, ప్రాంతం, జాతీయత వంటి అంశాలను ఈ కేసులోకి లాగడం తగదని పేర్కొంది. ఇలా చేయడం న్యాయమైన విచారణ హక్కుకు విరుద్ధమని తెలిపింది.
అమెరికా కోర్టు ఇచ్చిన ఒక తీర్పును కూడా ఉదాహరణగా సీబీఐ కోర్టు ప్రస్తావించింది. జాతి లేదా జాతీయత ఆధారంగా నిందితులను పిలవడం తప్పని అక్కడ కూడా చెప్పారని న్యాయస్థానం గుర్తు చేసింది. ఇకపై చార్జ్‌షీట్లు తయారు చేసే సమయంలో దర్యాప్తు సంస్థ చాలా జాగ్రత్తగా ఉండాలని సీబీఐ కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. నిందితుల గురించి తటస్థంగా, సాక్ష్యాల ఆధారంగా మాత్రమే రాయాలని సూచించింది. ప్రాంతం, గుర్తింపు వంటి అంశాలను ఉపయోగించడం మానుకోవాలని మందలించింది. నిందితుడు చేసిన నేరాన్ని మాత్రమే చూడాలని.. అతను ఎక్కడి వారన్నది కాదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ విద్యా రంగంలో సంస్కరణలు.. కీలక సిఫార్సులు చేసిన కమిషన్
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And Telugu News