Share News

కోర్టు కార్యకలాపాల్లో హిందీ వాడకంపై మద్రాస్ హైకోర్టు అడ్వొకేట్ల అసోసియేషన్ సవాలు

ABN , Publish Date - Nov 02 , 2026 | 07:52 PM

కోర్టు వ్యవహారాలు హిందీలో మాత్రమే జరిగేలా 1965 నాటి కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (ఎంహెచ్ఏఏ) హైకోర్టులో పిల్ వేసింది. ఎంహెచ్ఏఏ తరపున ఆ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.అరివిళగన్ ఈ పిల్ వేశారు.

కోర్టు కార్యకలాపాల్లో హిందీ వాడకంపై మద్రాస్ హైకోర్టు అడ్వొకేట్ల అసోసియేషన్ సవాలు

ఇంటర్నెట్ డెస్క్: కోర్టు వ్యవహారాలు హిందీలో మాత్రమే జరిగేలా అనుమతిస్తూ 1965 నాటి కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (ఎంహెచ్ఏఏ) హైకోర్టులో పిల్ వేసింది. ఎంహెచ్ఏఏ తరపున ఆ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.అరివిళగన్ ఈ పిల్ వేశారు. ఈ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జి.అరుళ్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. 1965 నాటి క్యాబినెట్ నిర్ణయం ప్రాంతీయ భాషలపై వివక్ష చూపేలా ఉందని పిల్‌లో ఎంహెచ్ఏఏ పేర్కొంది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ప్రస్తుతం ఇంగ్లిష్ భాష కొనసాగుతుండగా.. భవిష్యత్తులో దాని స్థానంలో హిందీని వాడావాలనే విధానం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది.


రాజ్యాంగంలోని 14, 19, 21 ఆర్టికల్స్‌కు ఆ నిర్ణయం వ్యతిరేకంగా ఉందని ఎంహెచ్ఏఏ పేర్కొంది. సమానత్వ హక్కు, భావప్రకటన స్వేచ్ఛ, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు ఆ ఆర్టికల్స్ రక్షణ కల్పిస్తాయని గుర్తుచేసింది. అయితే, 1965లో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటి వరకూ ఎందుకు సవాలు చేయలేదని బెంచ్ అడగగా.. ఆ తీర్మానం గురించి తమకు ఇటీవలే తెలిసిందని ఎంహెచ్ఏఏ తెలిపింది. సమాచార హక్కు చట్టం కింద ఓ అడ్వొకేట్ దరఖాస్తు చేశారని, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఆయనకు అందిందని వెల్లడించింది. రాజ్యాంగంలోని 348(3) ఆర్టికల్ ప్రకారం.. రాష్ట్ర హైకోర్టు విచారణల్లో స్థానిక అధికారిక భాషను ఉపయోగించాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరమని, ఆ నిబంధనను కేంద్ర హోంశాఖ అర్థం చేసుకుంటున్న తీరు అభ్యర్థనలను తిరస్కరించే అధికారం రాష్ట్రపతికి కల్పిస్తున్నట్లు ఉందని అసోసియేషన్ తెలిపింది.


ఇతర రాష్ట్రాల విషయంలోనూ వివక్ష చూపుతున్నారని పిటిషన్‌లో పేర్కొంది. గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక హైకోర్టుల్లో స్థానిక భాషల వినియోగానికి చేసిన ప్రతిపాదనలను తిరస్కరించారని, అదే సమయంలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ హైకోర్టుల్లో మాత్రం హిందీ వినియోగానికి అనుమతి ఇచ్చారని ఎంహెచ్ఏఏ వివరించింది. కాగా.. మద్రాస్ హైకోర్టులో తమిళ భాషను అధికారిక భాషగా గుర్తించాలనే డిమాండ్ నేపథ్యంలో ఈ పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. గత సెప్టెంబరులో తమిళనాడు అసెంబ్లీ ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అలాగే మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌కు చెందిన అడ్వొకేట్స్ అసోసియేషన్ కూడా 1965 కేంద్ర క్యాబినెట్‌పై పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు విచారణల్లో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ తమిళనాడులో మరింత బలపడుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

సర్ వ్యతిరేక ఆందోళనలు.. బాంబే హైకోర్టుకు ఇమ్రాన్ ఖాన్ బేషరతు క్షమాపణ

టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే విమానాల్లో వెళ్లొద్దు: సుప్రీం కోర్టు

Updated Date - Nov 02 , 2026 | 07:52 PM