Share News

టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే విమానాల్లో వెళ్లొద్దు: సుప్రీం కోర్టు

ABN , Publish Date - Nov 02 , 2026 | 05:07 PM

విమాన టికెట్ ధరల విషయంలో దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే విమానాల్లో వెళ్లొద్దు: సుప్రీం కోర్టు
Supreme Court on Airfares

ఇంటర్నెట్ డెస్క్: విమాన టికెట్ ధరల విషయంలో దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ధరలు ఎక్కువగా అనిపిస్తే విమాన ప్రయాణాలు చేయొద్దని తేల్చి చెప్పింది. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ విమాన టికెట్ల చార్జీలు ఈ మధ్య కాలంలో 700 శాతం మేర పెరిగాయని తెలిపారు. విమానయానం కూడా అత్యవసర సేవే అని చెప్పారు. కాబట్టి టికెట్ ధరల్లో భారీ పెరుగుదల రాజ్యాంగంలోని 14 అధీకరణను (సమానత్వ హక్కు) ఉల్లంఘిస్తోందని చెప్పే ప్రయత్నం చేశారు.


ఈ క్రమంలో జస్టిస్ విక్రమ్ నాథ్ నాయకత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటప్పుడు విమాన ప్రయాణాలు చేయొద్దని స్పష్టం చేసింది. మరోమాటకు తావు లేకుండా మరో కేసుపై దృష్టిసారించింది. టికెట్ ధరల నియంత్రణకు సంబంధించి భారతీయ వాయుయాన్ అధినియమ్-2026 పేరిట ఇటీవల కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 1 నుంచీ ఇవి అమల్లోకి రానున్నాయి. అత్యవసర సందర్భాల్లో మాత్రమే కేంద్రం ధరల నియంత్రణకు ఉపక్రమించేలా ఈ నిబంధనలను రూపొందించారు. మిగతా సందర్భాల్లో ధరలను మార్కెట్ పరిస్థితులకు వదిలిపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది.


ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో టికెట్ ధరలు పెంచక తప్పదని ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ సీఈఓ విల్లీ వాల్ష్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. రూపాయి మారకం విలువ తగ్గడం, ఇంధన ఖర్చులు పెరగడం తమకు భారంగా మారాయని ఆయన అన్నారు. ధరలు పెంచడం మినహా తమకు మరో మార్గం లేదని అన్నారు. అయితే, విమానయానం అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ రూ.1897 కోట్ల నష్టాలను చవి చూసింది.


ఈ వార్తలనూ చదవండి:

దియా మిర్జా వీడియోపై బీజేపీ అభ్యంతరం.. వీడియో డిలీట్

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్.. అమిత్ షా విమర్శలు

Updated Date - Nov 02 , 2026 | 05:39 PM