జలుక్‌బారీ నుంచి అస్సాం సీఎం పోటీ.. 88 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:41 PM
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 88 మంది అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ గురువారంనాడు విడుదల చేసింది. జలుక్‌బారీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పోటీ చేస్తున్నారు.
గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో (Assam Assembly Elections) పోటీ చేసే 88 మంది అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ (BJP) గురువారంనాడు విడుదల చేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) జలుక్‌బారీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. భవానీపూర్-సోర్బోగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రంజీత్ కుమార్ పోటీ పడుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన లోక్‌సభ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్‌కు దిస్పూర్ టిక్కెట్ ఇచ్చారు. నల్బరి నుంచి మంత్రి జయంత్ మల్లా బారువా పోటీ చేస్తున్నారు. బీజేపీ తొలి జాబితాలో ఆరుగురు మహిళలకు టిక్కెట్ లభించింది.
పోటీలో లేను.. ప్రతీక్ బోర్డోలోయ్
అస్సాం ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ బీజేపీలో చేరడంతో ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత ప్రతీక్ కీలక ప్రకటన చేశారు. మార్గెరీటా నియోజకవర్గం నుంచి తాను కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడం లేదని ప్రకటించారు. పార్టీ సభ్యుడిగానే తాను ఉంటానని తెలిపారు. తన తండ్రి మరో పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో తాను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం తగదని భావించినట్టు చెప్పారు. ఈమేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ మల్లికార్జున్ ఖర్గేకు ఆయన లేఖ రాశారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఏప్రిల్ 9న జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇవి కూడా చదవండి..
విజయాల ఉగాది.. దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు
నామినేషన్ వేసిన కేరళ సీఎం పినరయి విజయన్