Chhattisgarh Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో బెయిల్‌పై విడుదలైన చైతన్య బఘేల్
ABN , Publish Date - Jan 03 , 2026 | 08:04 PM
లిక్కర్ కుంభకోణం కేసులో ప్రమేయం ఉండి బెయిలుపై విడుదలైన ఇతర నిందితులైన అన్వర్ ధెబార్, అనిల్ తుతేజ, అరివింద్ సింగ్, అరుణ్‌పతి త్రిపాఠి, త్రిలోక్ సింగ్ ధిల్లాన్‌నులు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలయ్యారని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.
రాయపూర్: లిక్కర్ కుంభకోణంలో ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ (Chhattisgarh)కు రాష్ట్ర హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో అయన శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కుంభకోణానికి సంబంధించిన రెండు కేసుల్లో చైతన్య బఘేల్‌కు హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), చత్తీస్‌గఢ్ అవినీతి నిరోధక శాఖ (ACB)/ఆర్థిక నేరాల విభాగం (EOW) దాఖలు చేసిన కేసుల్లో చైతన్యకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది.
ఈ కేసులో ప్రమేయం ఉండి బెయిల్‌పై విడుదలైన ఇతర నిందితులైన అన్వర్ ధెబార్, అనిల్ తుతేజ, అరివింద్ సింగ్, అరుణ్‌పతి త్రిపాఠి, త్రిలోక్ సింగ్ ధిల్లాన్‌నులు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలయ్యారని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. వీరితో పోల్చుకుంటే చైతన్య ప్రమేయం చాలా తక్కువని తెలిపింది. క్రైమ్ ప్రొసీడింగ్స్‌కు అవసరమైన సరైన డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్లు, ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్, బ్యాంకు అకౌంట్లు, ప్రాపర్టీలు వంటి ఆధారాలు లేవని ఈడీని తప్పుపట్టింది. సాక్ష్యాలు ఆధారంగా ఆరోపణలు ఉండాలని పేర్కొంది.
సాదర స్వాగతం
చైతన్య బెయిల్‌పై విడుదల కావడంతో భూపేష్ బఘేల్‌తో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు జైలు బయట సాదర స్వాగతం పలికారు. చైతన్య తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ జెండా తీసుకుని SUVలో కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదిలారు. 'కొంత ఆలస్యమైనా న్యాయం జరిగింది. తీర్పు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. రాజ్యాంగంపై మరింత నమ్మకం పెంచింది' అని మీడియాతో మాట్లాడుతూ చైతన్య అన్నారు.
ఇవి కూడా చదవండి..
కూల్చివేతల డ్రైవ్ సరైనదే.. కర్ణాటక సర్కార్‌ను సమర్ధించిన శశిథరూర్
బీజేపీని చూసి ఆర్ఎస్ఎస్‌ను అర్ధం చేసుకోలేరు: మోహన్ భగవత్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి