Share News

అస్సాంలో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ.. పార్టీ మాజీ చీఫ్ రాజీనామా

ABN , Publish Date - Feb 16 , 2026 | 03:47 PM

అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌కు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత భూపెన్ కుమార్ బోరా రాజీనామా చేశారు.

అస్సాంలో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ.. పార్టీ మాజీ చీఫ్ రాజీనామా
Bhupen Kumar Bora

గువాహటి: అస్సాం (Assam) అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌కు ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత భూపెన్ కుమార్ బోరా (Bhupen Kumar Bora)రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించారు.


పార్టీ పక్కన పెట్టేసింది..

పార్టీ విషయాల్లో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెట్టేసినట్టు బోరా తన లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కీలకమైన సంస్థాగత నిర్ణయాల్లో తనను సంప్రదించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన రాజీనామాకు అంతర్గత అసంతృప్తులే కారణమని ఆయన మీడియాకు తెలిపారు. ఇటీవల జరిగిన మజులి యాత్రలో తమకు ఎవరు కావాలో కూడా నిర్ణయించే పరిస్థితులో పార్టీ లేదని, దీంతో పార్టీ భవితవ్యంపై తాము ఆలోచించుకోవాల్సి పరిస్థితి వచ్చిందని చెప్పారు. రాజీనామా అనంతరం పలువురు నాయకులు తనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. 'మా తలుపులు తెరిచే ఉన్నాయని అఖిల్ గొగేయ్ చెప్పారు. లురిన్ గొగోయ్ సైతం మాట్లాడారు. సీపీఎం సంప్రదించింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా సంప్రదించింది. అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు' అని బోరా అన్నారు.


బీజేపీలో చేరే అవకాశం

భూపెన్ కుమార్ బోరా బీజేపీలో చేరే అవకాశం ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంకేతాలిచ్చారు. అసోం అభివృద్ధి కోసం బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధపడితే స్వాగతించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అస్సాంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు.


కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు

అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బోరా 2021 నుంచి 2025 వరకూ ఉన్నారు. గత ఏడాది రాష్ట్ర యూనిట్‌లో నాయకత్వ మార్పుల్లో భాగంగా ఆయన స్థానంలో గౌరవ్ గొగోయ్‌ను నియమించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న బోరా అసోం రాజకీయాల్లో కీలక నేతగా పేరుతెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీని పటిష్టం చేసుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బోరా రాజీనామా కీలకంగా మారింది. భూపెన్ బోరాకు నచ్చచెప్పేందుకు గౌరవ్ గొగోయ్ ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

శబరిమలలో మహిళలకు ప్రవేశం.. 9 మందితో సుప్రీం దర్మాసనం

రాజస్థాన్‌లో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం..

Updated Date - Feb 16 , 2026 | 03:48 PM