Share News

ఇండియన్ బ్యాంకులో 'గోల్డ్ భాస్కర్'.. నిట్టనిలువునా ఖాతాదార్లు దగా..

ABN , Publish Date - Feb 16 , 2026 | 10:12 AM

బ్రతుకుల్ని భయభ్రాంతులకు గురిచేసే ఘటన ఇది. బెంగళూరులో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ జాతీయ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్.. జూదం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని సొంతానికి వేరే బ్యాంకులో తాకట్టు పెట్టాడు.

ఇండియన్ బ్యాంకులో 'గోల్డ్ భాస్కర్'.. నిట్టనిలువునా ఖాతాదార్లు దగా..
Indian Bank gold fraud

బెంగళూరు, ఫిబ్రవరి 16: బ్యాంకుల్లో నగదు, నగలు భద్రంగా ఉంటాయని నమ్మే సామాన్యులకు ఈ వార్త మింగుడుపడటం లేదు. బెంగళూరులోని గిరినగర్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఓ బ్యాంక్ అధికారి, కస్టమర్లు లోన్ కోసం పెట్టిన బంగారాన్ని దొంగతనంగా వాడుకొని ఏకంగా రూ. 3.5 కోట్ల మేర మోసానికి పాల్పడ్డాడు.

అసలేం జరిగింది?

బెంగళూరు గిరినగర్ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా కిరణ్ కుమార్ (34) అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం కిరణ్ కుమార్ గత కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్, ఇంకా జూదానికి (Gambling) బానిసయ్యాడు. తన వ్యసనాల కోసం డబ్బు అవసరమవ్వడంతో బ్యాంకు లాకర్లపై తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. కస్టమర్లు గోల్డ్ లోన్ కోసం బ్యాంకులో ఉంచిన బంగారు ఆభరణాలను మెల్లమెల్లగా బయటకు తీసి, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు.


గుట్టు రట్టు అయిందిలా..

ఫిబ్రవరి 2న ఒక మహిళా కస్టమర్ తన గోల్డ్ లోన్ చెల్లించి, తాకట్టు పెట్టిన నగలను తిరిగి తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చింది. ఆమెకు ఇచ్చిన ప్యాకెట్‌ను తెరిచి చూడగా, అందులో ఉండాల్సిన నగలు మాయమయ్యాయి. దీనిపై ఆమె అధికారులను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.

వెంటనే అలర్ట్ అయిన బ్యాంక్ మేనేజ్మెంట్ అంతర్గత తనిఖీ నిర్వహించగా, సుమారు 2.7 కిలోల బంగారం (విలువ రూ. 3.5 కోట్లకు పైగా) మాయమైనట్లు తేలింది. మొత్తం 24 ప్యాకెట్లలో బంగారం మాయమవ్వగా, అందులో 21 ప్యాకెట్లు పాక్షికంగా, 3 ప్యాకెట్లు పూర్తిగా ఖాళీ అయ్యాయి.

పోలీసుల చర్యలు:

బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు గిరినగర్ పోలీసులు కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ఇప్పటివరకు పోలీసులు సుమారు 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని రికవరీ చేసేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన బ్యాంకింగ్ వ్యవస్థలో భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. బ్యాంకులు తమ ఆడిటింగ్ ప్రక్రియలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి..

ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..

ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..

Updated Date - Feb 16 , 2026 | 10:52 AM