బస్సుకు అడ్డుగా 'లేడీ సింగం'.. సోషల్ మీడియాలో ప్రశంసలు
ABN , Publish Date - Jul 30 , 2026 | 05:18 PM
రైతుల ఆందోళనలో సాహసోపేతంగా వ్యవహరించారు ఓ పోలీస్ అధికారిణి. ఆమె చూపిన ధైర్యసాహసాలకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: పోలీస్ వ్యాన్ ముందు నిల్చుని విద్యార్థులకు మద్దతుగా నిలిచిన ఓ మహిళ దృశ్యాలు వైరల్ అయిన కొద్దిరోజులకే.. మరో వీడియో వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో రైతుల ఆందోళన సందర్భంగా ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ చూపిన ధైర్యసాహసం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నగరంలోకి రైతులు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బస్సును నిరసనకారులు ముందుకు నెట్టేందుకు యత్నించగా.. ట్రాఫిక్ అండ్ క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ) మోనికా శుక్లా బస్సుకు ఎదురుగా నిల్చుని దానిని అడ్డుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఆమెను పలువురు 'భోపాల్ లేడీ సింగం'గా అభివర్ణిస్తున్నారు.
సీఎం మోహన్ యాదవ్ నివాసం వైపు రైతులు భారీగా ర్యాలీగా వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అదనపు బారికేడ్లుగా పాఠశాల బస్సులను రోడ్డుపై నిలిపారు. అయితే.. నిరసనకారులు వాటిని తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు యత్నించారు. బస్సు ముందుకు కదులుతుండటాన్ని గమనించిన మోనికా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానిముందు నిలబడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆమెను ధైర్యసాహసాల్ని చూసిన అన్నదాతలు.. చివరకు బస్సును వదిలేశారు.
ఈ ఘటనపై మోనికా శుక్లా స్పందిస్తూ.. తానేమీ అసాధారణ పనేమీ చేయలేదని, విధి నిర్వహణలో భాగంగానే అలా చేశానని చెప్పారు. పరిస్థితిని అంచనా వేసి తక్షణమే నిర్ణయం తీసుకుని బస్సు ముందు నిలబడ్డానని, ఆ సమయంలో ఎలాంటి భయమూ కలగలేదన్నారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడటం పోలీసుల బాధ్యత అని ఆమె తెలిపారు.
ఇవీ చదవండి:
బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28 కోట్ల నగదు.. లెక్కించడంలో 5 మెషీన్లు విఫలం
ఢిల్లీలో ఆప్ కార్యాలయం ముట్టడి.. పంజాబ్ పేపర్ లీక్‌పై బీజేపీ ఆందోళన