ఘనంగా ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు..
ABN , Publish Date - Jan 29 , 2026 | 07:29 PM
దేశ రాజధానిలోని విజయ్ చౌక్ ప్రాంతంలో ‘బీటింగ్ రిట్రీట్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంతో దేశ 77వ గణతంత్ర దినోత్సవాలకు తెరపడింది..
ఢిల్లీ, జనవరి29: దేశ రాజధాని ఢిల్లీలోని విజయ్ చౌక్ ప్రాంతంలో నిర్వహించిన ‘బీటింగ్ రిట్రీట్’ కార్యక్రమంతో 77వ గణతంత్ర దినోత్సవాలకు తెరపడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి వర్గంలోని పలువురు సభ్యులు పాల్గొన్నారు. అలాగే త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సాయుధ దళాల నుంచి జాతీయ గౌరవ వందనం స్వీకరించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. రాష్ట్రపతి ముర్ము ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంప్రదాయ రీతిలో గుర్రపు బగ్గీలో విచ్చేశారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాలకు చెందిన బ్యాండ్ బృందాలు ప్రదర్శించిన విన్యాసాలు, దేశభక్తి గీతాలాపన చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. భారతీయ సైనిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ కార్యక్రమం, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచింది. సూర్యాస్తమయ సమయానికి జాతీయ జెండాను అవనతం చేయడంతో గణతంత్ర ఉత్సవాలు అధికారికంగా ముగిశాయి. ఈ వేడుకలో ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ రక్షణలో సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, ఈ కార్యక్రమం భారత ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు.
బీటింగ్ రిట్రీట్..
బ్రిటన్ రాణి ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్‌లు 1955లో భారత సందర్శనకు వచ్చిన సందర్భంగా మొట్టమొదటి సారిగా 'బీటింగ్ రిట్రీట్' కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటి నుంచి ఈ కార్యక్రమం ఏటా పాటించే సంప్రదాయంగా మారింది. బీటింగ్ రిట్రీట్ వేడుక అనేది గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల ముగింపును అధికారికంగా సూచిస్తుంది. ఇందులో ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన బ్యాండ్‌లు.. దేశభక్తి గీతాలు, కవాతు గీతాలను ప్లే చేస్తూ సమన్వయంతో ప్రదర్శనలు జరుగుతాయి. ఈ కార్యక్రమం సందర్భంగా ఢిల్లీలోని ప్రభుత్వ భవనాలను విద్యుత్తు దీపాలతో అలకరించారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ సర్కార్ సాధించిందేమీలేదు.. ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ
ఫిబ్రవరిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్రదేశాలు మిస్ అవ్వొద్దు..