Share News

తమిళనాడు, బెంగాల్ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర.. 23న ఓటింగ్

ABN , Publish Date - Apr 21 , 2026 | 09:12 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో పాటు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈనెల 23న రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరుగనుంది.

తమిళనాడు, బెంగాల్ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర.. 23న ఓటింగ్
PM Modi and Mamata Banerjee

న్యూఢిల్లీ: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో పాటు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈనెల 23న రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరుగనుంది.


బెంగాల్ తొలివిడతలో 152 నియోజకవర్గాలు

దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓటింగ్ సరళిపై ఆసక్తి నెలకొంది. నార్త్ బెంగాల్, సౌత్‌ బెంగాల్‌లోని కొన్ని జిల్లాలతో కలిపి మొత్తం 152 నియోజకవర్గాల్లో తొలివిడత పోలింగ్ ఈనెల 23న జరుగనుంది. 3.60 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.84 కోట్ల మంది మహిళా ఓటర్లు, 1.75 కోట్ల మంది పురుష ఓటర్లు, 465 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 2,450 సెంట్రల్ పారామిలిటరీ బలగాలతో కలిపి 2.5 లక్షల మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల కమిషన్ మోహరించింది.


west-bengal-1.jpg

తొలివిడత పోలింగ్‌లో 8,000 పోలింగ్ స్టేషన్లను అత్యంత సున్నితమైనవిగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. వీటిలో మాల్డా, ముర్షీదాబాద్, ఉత్తర్ దినజ్‌పూర్, కూచ్‌బెహర్, బీర్భూమ్, బుర్ద్వాన్ వంటి జిల్లాలున్నాయి. ముందస్తు చర్యగా 2,193 సత్వర స్పందన బృందాలను ఈసీ రంగంలోకి దింపింది.


అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు విస్తృత ప్రచారం సాగించింది. ఎస్ఐఆర్ తర్వాత సుమారు 91 లక్షల మంది ఓటర్లు తగ్గగా, మమతాబెనర్జీ 15 ఏళ్ల పాలనకు ఉద్వాసన చెప్పి ఈసారి అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ప్రచారం జరిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులు ప్రచారం చేశారు. భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తుండగా, సువేందు అధికారిని బీజేపీ పోటీలోకి దింపడంతో అక్కడ పోటీ ఉత్కంఠభరితంగా మారింది.


tamilnadu.jpg

తమిళనాడులో నువ్వా-నేనా

ఈసారి తమిళనాడులోనూ పోటీ ఉత్కంఠ కలిగిస్తోంది. ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సారథ్యంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ మరోసారి విజయం సాధించేందుకు పట్టుదలగా ఉంది. అన్నాడీఎంకే సారథ్యంలో బీజేపీతో కూడిన ఎన్డీయే ఈసారి తమిళనాడులో చక్రం తిప్పుతామనే ధీమాతో ఉంది. తమిళనాడులో ప్రత్నామ్నాయ శక్తి తామేనంటూ టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో తమిళనాట త్రిముఖ పోటీ కనిపిస్తోంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నుంచి 4,000కు పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈనెల 23న ఒకే విడతలో పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

అది నాకు గర్వకారణం.. సీఎం స్టాలిన్ వీడియో సందేశం

విజిల్ రెవల్యూషన్‌‌కు పిలుపు.. టీవీకే చీఫ్ విజయ్ బహిరంగ లేఖ

Updated Date - Apr 21 , 2026 | 09:42 PM