పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ చిక్కుల్లో యూసఫ్ పఠాన్!
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:38 PM
త్వరలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికల వేళ టీఎంసీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ చిక్కుల్లో పడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో ఉంది. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ టీఎంసీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ చిక్కుల్లో పడ్డాడు. ఓ వ్యక్తిపై దాడి చేశారనే ఆరోపణలతో యూసుఫ్ పఠాన్ మామ, ఆయన కుమారుడు, మరో బంధువు కలిసి ఒక వ్యక్తిపై, అతని కుటుంబంపై దాడి చేశారనే ఆరోపణలతో ముంబై పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం..
మహానగరం ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో ఒక కారు వెళ్తున్న క్రమంలో గుంతలోని నీరు రోడ్డు పక్కన ఉన్న వ్యక్తిపై చిమ్మింది. ఈ చిన్న కారణంతో ఆగ్రహానికి గురైన నిందితులు, కారులో ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగారు. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారి.. పరస్పర దాడుల వరకు వెళ్లింది. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన బైకుల్లా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా పోలీసులు పలు కీలక ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు.
దాడికి ఉపయోగించిన కర్రలు, బేస్ బాల్ బ్యాట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ 118(2), 115(2), 324, 352, 351(2), 3(5) కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ, ఒక సిట్టింగ్ ఎంపీ అయిన యూసుఫ్ పఠాన్ బంధువులు ఇలాంటి గొడవల్లో అరెస్ట్ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్ని ప్రచారంలో ప్రస్తావించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
మమతకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది: అమిత్‌షా
రాత్రి వేళ ద్విచక్ర వాహనాలు, పగలు పిలియన్ రైడింగ్‌పై నిషేధం: ఈసీ