Share News

అది నాకు గర్వకారణం.. సీఎం స్టాలిన్ వీడియో సందేశం

ABN , Publish Date - Apr 21 , 2026 | 05:19 PM

తమిళనాడు ప్రయోజనాలే తనకు ముఖ్యమని డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. తన తండ్రి కరుణానిధి కంటే తాను ప్రమాదకారినని ప్రత్యర్థులు చేసే విమర్శలకు గర్వపడుతుంటానని చెప్పారు. ఇదొక గౌరవంగా కూడా భావిస్తానని అన్నారు.

అది నాకు గర్వకారణం.. సీఎం స్టాలిన్ వీడియో సందేశం
MK Stalin

చెన్నై: తమిళనాడు ప్రయోజనాలే తనకు ముఖ్యమని డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. తన తండ్రి కరుణానిధి కంటే తాను ప్రమాదకారినని ప్రత్యర్థులు చేసే విమర్శలకు గర్వపడుతుంటానని చెప్పారు. ఇదొక గౌరవంగా కూడా భావిస్తానని అన్నారు. తమిళనాడు ప్రజలను వంచించి, రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవాలని చూసే వారికి తాను ఎప్పుడూ ప్రమాదకారిగానే ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని మంగళవారంనాడు విడుదల చేశారు.


'2021 అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు నన్ను కరుణానిధి కంటే ప్రమాదకారినని అన్నారు. నేను ఎప్పుడూ కరుణానిధితో పోల్చుకోలేదు. ఆయనను నాన్నగారని పిలవడం కంటే మా నాయకుడిగానే ఎక్కువగా సంబోధించే వాడిని. అలాంటి నేత కంటే నన్ను ప్రమాదకారినని పిలిచినప్పుడు నాకు ఒకటే అనిపించేది. తమిళనాడును వంచించి, మన ప్రగతిని అడ్డుకునే వారికి నేనెప్పుడూ ప్రమాదకారిగానే ఉంటాను' అని స్టాలిన్ పేర్కొన్నారు. మా నాయకుడి (కరుణానిధి) కంటే తాను ఒక అడుగు ముందున్నానని ఎవరైనా అంటే అందుకు గర్వపడతానని, ఎందుకంటే తమిళ ప్రజల రక్తంలోనే ఆ స్ఫూర్తి ఉందని అన్నారు.


ఆ ప్రతులను తగులబెట్టిన మొదట వ్యక్తిని నేనే..

గత వారం లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుపై స్టాలిన్ మాట్లాడుతూ, ప్రతిపాదిత బిల్లు ప్రతులను దగ్ధం చేసిన తొలి వ్యక్తి తానేనని చెప్పారు. 'గతవారం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చింది. జనాభా నియంత్రణను సమర్ధవంతంగా అమలు చేసి పారిశ్రామికాభివృద్ధిలో ఉత్తమ పనితీరు ప్రదర్శించిన తమిళనాడును శిక్షించేందుకు ఉద్దేశించినదిగా ఈ బిల్లు ఉంది. బిల్లు సభలో ప్రవేశపెట్టగానే దానిని మొదటిగా వ్యతిరేకించి, ప్రతులను దగ్ధం చేయడంతో సహా నిరసనలకు సారథ్యం వహించాను. మనం వెలిగించిన నిప్పు ఆ బిల్లును బూడిద చేసింది' అని స్టాలిన్ పేర్కొన్నారు.


23న పోలింగ్

తమిళనాడు ఓటర్ల జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 44 నియోజకవర్గాలను షెడ్యూల్డ్ కులాలకు, 2 నియోజకవర్గాలను షెడ్యూల్డ్ తెగలకు కేటాయించారు. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, విజయ్ టీవీకే, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మే 2న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

మమతకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది: అమిత్‌షా

రాత్రి వేళ ద్విచక్ర వాహనాలు, పగలు పిలియన్ రైడింగ్‌పై నిషేధం: ఈసీ

Updated Date - Apr 21 , 2026 | 05:21 PM