Share News

నకిలీ ఈనో, నెస్కేఫ్ కాఫీ బ్రాండ్స్ గుట్టు రట్టు.. నలుగురి అరెస్ట్

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:43 PM

ఢిల్లీలో ఓ నకిలీ దందా గుట్టురట్టయింది. బ్రాండ్ సంస్థల పేరిట డూప్లికేట్ వస్తువులను తయారుచేసి, మార్కెట్లకు సరఫరాచేసి సొమ్ముచేసుకుంటున్న రెండు యూనిట్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు.

నకిలీ ఈనో, నెస్కేఫ్ కాఫీ బ్రాండ్స్ గుట్టు రట్టు.. నలుగురి అరెస్ట్
Fake ENO, Nescafe Coffee manufacturing racket busted

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధానిలో మరో నకిలీ దందా బయటపడింది. బ్రాండెడ్ ఉత్పత్తులైన ఈనో(ENO), నెస్కేఫ్‌(NESCAFE) పేరిట నకిలీ ఉత్పత్తులను తయారుచేసి సొమ్ముచేసుకుంటున్న ముఠా గుట్టురట్టయింది. నకిలీ ఈనో పౌడర్, నెస్కేఫ్ కాఫీ పొడి తయారీ రాకెట్‌ను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు. రూ.20 లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


నిర్దిష్ట సమాచారం ఆధారంగా మధు విహార్ ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహించి.. రెండు అక్రమ యూనిట్లను గుర్తించారు. అక్కడ ఫేక్ ఈనో పౌడర్, నెస్కేఫ్ కాఫీ పొడిని తయారుచేస్తున్నట్టు అధికారులు తేల్చారు. నకిలీ ENO పౌడర్, కల్తీ కాఫీ సాచెట్లను ఉత్పత్తి చేసి.. వాటిని హోల్‌సేల్, రిటైల్ ధరలకు పలు ప్రాంతాల్లోని మార్కెట్లకు సరఫరా చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో సుమారు రూ.20 లక్షల విలువైన మూడు ప్యాకేజింగ్ యంత్రాలు, అమ్మకానికి సిద్ధంగా ఉన్న దాదాపు లక్ష ఈనో సాచెట్లు, యాభై వేల కాఫీ సాచెట్లు, 500 కిలోల కాఫీ పొడి, యాసిడ్ డ్రమ్ములు, ప్యాకేజింగ్ రోల్స్, స్టిక్కర్లు, కార్టన్‌, ఇతర తయారీ సామగ్రిని సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. సంబంధిత కంపెనీల ప్రతినిధుల తనిఖీ అనంతరం వాటిని సీజ్ చేశామన్నారు. ఆ వస్తువులను తాము తయారు చేయలేదని, అలాగే ఏ లైసెన్సింగ్ ఒప్పందం కింద కూడా తమకు అధికారం లేదని ఆ కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నట్టు చెప్పారు.


ఈ కేసుకు సంబంధించి ఉత్తమ్ దాస్, పాపాయి దాస్ అలియాస్ పంకజ్, నితిన్ భరద్వాజ్, సంజయ్ బన్సల్ అనే నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులు రెండు ఫ్లాట్లను అద్దెకు తీసుకుని 2 నెలలుగా ఈ అక్రమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మరిన్ని వివరాలు సేకరించే దిశగా విచారణ సాగిస్తున్నారు.


ఇవీ చదవండి:

ఇరాన్‌కు చైనా సాయం.. ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం.?

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. ఇస్లామాబాద్ చర్చలపై పెరుగుతున్న సందిగ్ధత

Updated Date - Apr 21 , 2026 | 04:49 PM