ఇరాన్‌కు చైనా సాయం.. ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం.?
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:39 PM
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌కు చైనా సాయపడుతోందని ఆది నుంచీ పలు మీడియా కథనాల ద్వారా వెల్లడవుతూనే ఉంది. అయితే.. ఈ కథనాలను నిజంచేసేలా యూఎస్ రిపబ్లికన్ పార్టీ సభ్యులొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకెళితే...
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు చైనా రహస్యంగా సాయమందిస్తున్నట్టు ఇప్పటికే అనేక కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ సభ్యురాలు, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధనం చేశాక.. యూఎస్ నౌకాదళం స్వాధీనం చేసుకున్న నౌక ఒకటి చైనా నుంచి వచ్చిందని.. అందులో క్షిపణి తయారీకి వినియోగించే రసాయనాలున్నాయని ఆమె పేర్కొన్నారు.
కాగా.. దిగ్బంధనం అనంతరం అమెరికా నౌకాదళం హార్మూజ్ జలసంధిలో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న 'టౌస్కా' అనే ఓ కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకుంది. అది ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ షిప్పింగ్ లైన్స్(IRISL)కు చెందినది. ఇరాన్ తయారుచేసే క్షిపణులకు కావల్సిన వస్తువులను సరఫరా చేస్తుందనే ఆరోపణలతో 2019లోనే వీటిపై ఆంక్షలు విధించింది అమెరికా. ఈ క్రమంలో ఇదే నౌక చైనా నుంచి ఇరాన్‌కు క్షిపణుల తయారీకి అవసరమైన కెమికల్స్‌ను తీసుకెళ్తోందని నిక్కీ హేలీ ఆరోపించారు. ఈ నౌకలను ఆపాలన్న అమెరికా ఆదేశాలను ఇరాన్ పెడచెవిన పెట్టిందని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో యుద్ధంలో ఇరాన్‌కు చైనా సాయమందిస్తోందనే విషయం బహిర్గతమైందని, అది విస్మరించలేని వాస్తవమని నిక్కీ చెప్పుకొచ్చారు. నిక్కీ వ్యాఖ్యలు నిజమైతే.. చైనా అడ్డంగా బుక్కైనట్టే! దీంతో ఇరాన్‌తో పాటు చైనాను కూడా అమెరికా టార్గెట్ చేసే అవకాశముందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. నిక్కీ ఆరోపణలపై ఇరాన్ గట్టిగా స్పందించింది. నౌక విషయంలో అమెరికా చర్యను సాయుధ దోపిడీగా అభివర్ణించింది. ఆ నౌక చైనా నుంచి ప్రయాణిస్తోందని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఆ సమయంలో అమెరికా బలగాలను ఎదుర్కోవడానికి తాము సిద్దంగా ఉన్నప్పటికీ.. నౌకలో సిబ్బంది కుటుంబ సభ్యులు ఉన్నందున తక్షణమే ప్రతిస్పందించలేక పోయామంది.
ఏది ఏమైనా.. 'టౌస్కా' నౌక స్వాధీనం అమెరికా-ఇరాన్-చైనాల మధ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్టైంది. దీంతో చైనా-అమెరికా సంబంధాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశముంది. అమెరికా ఆంక్షలు కఠినతరం కావడం సహా.. చైనాపై మరిన్ని ఆంక్షలు విధించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇరుదేశాల మధ్య ఉన్న వాణిజ్య యుద్ధాన్ని మరింత కఠినతరం చేయనున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి:
ఐపీఎల్ 2026: ఒకే సెంచరీ.. పలు రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2026: తొలి సెంచరీపై తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు