అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. ఇస్లామాబాద్ చర్చలపై పెరుగుతున్న సందిగ్ధత
ABN , Publish Date - Apr 21 , 2026 | 08:22 AM
ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గకపోగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చర్చలపై అయోమయాన్ని సృష్టిస్తున్నాయి..
ఇంటర్నెట్ డెస్క్: ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గకపోగా.. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చర్చలపై అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలను ముగించాల్సిన తొందరేమీ లేదని ఒక సందర్భంలో వ్యాఖ్యానించిన ఆయన.. అంతలోనే కొత్త చర్చలు త్వరలోనే ప్రారంభం కావొచ్చని పేర్కొనడం గమనార్హం. ఈ రెండు భిన్నమైన ప్రకటనలు దౌత్య పరమైన వ్యూహాలలో అనిశ్చితిని పెంచుతున్నాయి.
ఇరుపక్షాల మధ్య 14 రోజుల కాల్పుల విరమణ నేటితో (బుధవారం) ముగియనుంది. గడువు సమీపిస్తున్నప్పటికీ.. తదుపరి చర్చల కోసం జేడీ వాన్స్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని పాకిస్థాన్‌కు పంపాలని తాను యోచిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే, అమెరికా తన వైఖరిని మార్చుకోనంత వరకూ తాము పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు.. ఒప్పందం కుదరకపోతే సైనిక ఉద్రిక్తతతో సహా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. ఒత్తిడితో కూడిన చర్చలను ఇరాన్ అధికారులు గట్టిగా తిరస్కరించారు. ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి వాషింగ్టన్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ.. పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాఫ్ విమర్శించారు. బెదిరింపులతో కూడిన చర్చలను ఇరాన్ అంగీకరించదని, అవసరమైతే కొత్త వ్యూహాలతో ప్రతిస్పందించడానికి దేశం సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ చేశారు. ఈ నెల 11,12 వ తేదీలలో ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగాయి. కానీ, అవి ఎటువంటి పురోగతి లేకుండా ముగియడంతో.. చర్చల భవిష్యత్తు అనిశ్చితిగా మారింది అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మెల్‌బోర్న్‌లో ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు
ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ రక్తదాన శిబిరం