విజిల్ రెవల్యూషన్‌కు పిలుపు.. టీవీకే చీఫ్ విజయ్ బహిరంగ లేఖ
ABN , Publish Date - Apr 21 , 2026 | 07:34 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెరపడింది. 23వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. చివరి ప్రచార అస్త్రంగా టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు మంగళవారంనాడు బహిరంగ లేఖ రాశారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెరపడింది. 23వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. చివరి ప్రచార అస్త్రంగా టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు మంగళవారంనాడు బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు తన పట్ల చూపిన ప్రేమ, ఆదరణను తిరిగి చెల్లించుకునేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, అప్పట్నించి తనను ఎన్నో శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశాయని చెప్పారు. అయితే తాను ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదన్నారు. తమ పార్టీ విజిల్ గుర్తుకు ఓటు వేసి మార్పు కోసం పోరాడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
తమ పార్టీ తలబెట్టిన సంక్షేమ ఆధారిత దార్మినికతను ఏ శక్తీ అడ్డుకోలేదని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. అలాంటి శక్తులకు పార్టీకి గట్టి వెన్నుదున్నుగా నిలుస్తున్న మహిళలు, యువత గట్టి గుణపాఠం చెప్పాలని విజయ్ కోరారు. టీవీకేను నిజాయతీ కలిగిన నిప్పుకణిక అని, సామాజిక న్యాయాన్ని కాపాడే కోట అని అభివర్ణించారు. ప్రజలు తనపట్ల చూపిస్తున్న ప్రేమే తన బలం అని, ఆ ప్రేమే ఒత్తిళ్లు, బాధ, సవాళ్లను తట్టుకునే శక్తిని తనకు ఇచ్చిందని అన్నారు. ఏ దుష్టశక్తి ప్రజలను తననుంచి వేరు చేయలేదన్నారు.
రాజకీయ గ్యాంబ్లర్లు పట్ల జాగ్రత్త
ధనబలం కలిగిన పార్టీలు స్వార్ధ ప్రయోజనాలతో ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తాయని, అలాంటి రాజకీయ గ్యాంబ్లర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయ్ హెచ్చరించారు. విజిల్ గుర్తుకు ఓటు వేసి మార్పుకోసం పోరాడాలని కోరారు. వేరే ఏ గుర్తుకు ఓటు వేసినా అది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విభజన శక్తులకు మద్దతిచ్చినట్టే అవుతుందన్నారు. చెన్నైలోని పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. మహిళకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం, ఆరు ఎల్పీజీ సిలిండర్లు, రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పిస్తామని టీవీకే వాగ్దానం చేసింది.
ఇవి కూడా చదవండి..
మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన ఖర్గే.. మండిపడిన బీజేపీ
అది నాకు గర్వకారణం.. సీఎం స్టాలిన్ వీడియో సందేశం