మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన ఖర్గే.. మండిపడిన బీజేపీ
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:13 PM
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రిని 'టెర్రరిస్టు'గా అభివర్ణించారు. ఆయనకు సమానత్వం, న్యాయంపై నమ్మకం లేవన్నారు.
చెన్నై: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రిని 'టెర్రరిస్టు'గా అభివర్ణించారు. ఆయనకు సమానత్వం, న్యాయంపై నమ్మకం లేవన్నారు. అలాంటి వాళ్లతో అన్నాడీఎంకే కలవడమంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరిరోజైన మంగళవారంనాడు ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖర్గే వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ
ప్రధాని మోదీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఖండించారు. కాంగ్రెస్ పార్టీ మైండ్‌సెట్‌కు ఆయన చేసిన వ్యాఖ్యలు అద్దంపడతాయన్నారు. ఆయన నోరుజారి ఈ వ్యాఖ్యలు చేయలేదని, ఉద్దేశపూర్వకంగా చేసినవేనని అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిరోజూ తన ప్రసంగాల్లో ప్రధానిని నిందిస్తుంటారని, ఈరోజు రాహుల్ తరఫున మల్లికార్జున్ ఖర్గే ఆపని చేశారని అన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒసామా బిన్ లాడెన్‌ను ఒసామాజీ అని, జకీర్ నాయక్‌ను శాంతిదూత అని సంబోధిస్తుంటుందని ఎద్దేవా చేశారు. ప్రధానిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిందించినా ప్రజలు శిక్షిస్తూనే వచ్చారని, ఈసారి కూడా ప్రజలు గట్టి సమాధానం ఇస్తారని అన్నారు.
టెర్రరిస్టు వ్యాఖ్యలపై ఖర్గే వివరణ
కాగా, ప్రచార సభలో చేసిన టెర్రరిస్టు వ్యాఖ్యలపై ఖర్గే వివరణ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం రాజకీయ పార్టీలను, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోందని, సీబీఐ, ఈడీ, ఆదాయం పన్ను శాఖ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని అన్నారు. ఆ సందర్భంలోనే తాను మాట్లాడానని, ఆయన (మోదీ)ను టెర్రరిస్టు అని తాను అనలేదని చెప్పారు. ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని చెప్పడమే తన ఉద్దేశమని వివరించారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..
కాంగ్రెస్, డీఎంకే కూటమి సాగించిన ప్రచారంపై మీడియా అడిగినప్పుడు, చాలాబాగా జరిగిందని, అన్ని చోట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తమ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఖర్గే సమాధానమిచ్చారు. రాహల్ గాంధీ, స్టాలిన్ ఒకే వేదిక నుంచి ప్రచారం సాగించకపోవడంపై అడిగినప్పుడు, ఆ విధంగా చూడకూడదని, ప్రతి ఒక్కరూ ప్లానింగ్ ప్రకారమే ప్రచారం చేస్తుంటారని చెప్పారు. 'నేను ఒకచోట నుంచి ప్రచారం చేస్తే, రాహుల్ మరో చోట ఉంటారు. ఎవరు ఎక్కడ ప్రచారం చేసినా సమష్టి ఆలోచనతోనే ప్రచారం సాగుతుంది. అంతా కలిసికట్టుగా పోరాటం సాగించాం. మేము గెలుస్తాం' అని ఖర్గే సమాధానమిచ్చారు.
ఇవి కూడా చదవండి..
అది నాకు గర్వకారణం.. సీఎం స్టాలిన్ వీడియో సందేశం
మమతకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది: అమిత్‌షా