పవన్ ఖేడా ట్రాన్సిట్ బెయిలుపై సుప్రీంకోర్టుకు అసోం ప్రభుత్వం
ABN , Publish Date - Apr 13 , 2026 | 01:29 PM
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడాకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన వారం రోజుల ట్రాన్సిట్ బెయిలుపై అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టును సోమవారంనాడు ఆశ్రయించింది. ట్రాన్సిట్ బెయిలు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా (Pawan Khera)కు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన వారం రోజుల ట్రాన్సిట్ బెయిలుపై అస్సాం ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)ను సోమవారంనాడు ఆశ్రయించింది. ట్రాన్సిట్ బెయిలు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. సీజేఐ సూర్యకాంత్ బుధవారంలోపు దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉంది.
అస్సాంలో నమోదైన కేసుకు సంబంధించి పవన్ ఖేడాకు తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 7న తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి శర్మకు మూడు విదేశీ పాస్‌పోర్టులు, విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని, ఈ వివరాలను అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం దాచిపెట్టారని పవన్ ఖేడా ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన రిణికి శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. అసోం పోలీసుల బృందం ఇటీవల న్యూఢిల్లీలోని పవన్ ఖేడా నివాసానికి వెళ్లినప్పటికీ ఆయన అక్కడ లేకపోవడంతో వెనుదిరిగింది.
ఈ కేసులో అరెస్టుకు అవకాశం ఉందనే కారణంగా ముందస్తు బెయిలు కోసం తెలంగాణ హైకోర్టులో పవన్ ఖేడా పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో తన నివాసం హైదరాబాద్‌లో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. పోలీసు చర్యకు అవకాశం ఉన్నందున తనకు లీగల్ ప్రొటక్షన్ కల్పించాలని కోర్టును కోరారు. దీంతో పవన్ ఖేడా సంబంధిత కోర్టులో పిటిషన్ వేసేందుకు వీలుకల్పిస్తూ వారం రోజుల ట్రాన్సిట్ బెయిలును హైకోర్టు మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి..
21వ శతాబ్దం మహిళలదే.. కొత్త చరిత్రను లిఖించనున్నాం: మోదీ
మోదీ యూటర్న్‌కు 30 నెలలు పట్టింది.. పార్లమెంటు ప్రత్యేక సమావేశంపై సోనియాగాంధీ ఫైర్