బెంగాల్‌లో రాజకీయ మార్పు మొదలు.. అసన్‌సోల్‌లో తెరుచుకున్న దుర్గ గుడి
ABN , Publish Date - May 05 , 2026 | 03:16 PM
బెంగాల్‌లో రాజకీయ మార్పులు మొదలయ్యాయి. ఎన్నో ఏళ్లుగా మూతపడిన ఓ ఆలయం.. బీజేపీ భారీ విజయంతో తిరిగి తెరుచుకోవడమే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకెళితే...
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించడంతో.. ఆ రాష్ట్రంలో మార్పులు మొదలయ్యాయి. రాజకీయ మార్పునకు ప్రతీకగా.. అసన్‌సోల్‌లో ఏళ్ల తరబడి మూతపడి ఉన్న దుర్గా ఆలయం తిరిగి తెరుచుకోవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీ శ్రీ దుర్గామాత ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆలయం.. ఎట్టకేలకు భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆలయం తెరుచుకున్న వెంటనే స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించడం విశేషం. ఈ పరిణామం ప్రాంతీయ రాజకీయ మార్పునకు సంకేతమని బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు.
అసన్‌సోల్ దక్షిణ నియోజకవర్గంలో బీజేపీ తరఫున బరిలోకి దిగిన అగ్నిమిత్రా పౌల్.. టీఎంసీ అభ్యర్థి తపస్ బెనర్జీపై 40,839 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో అగ్నిమిత్ర.. ఆలయ పునఃప్రారంభంలో కీలకపాత్ర పోషించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయమై ఆలయ కమిటీ సభ్యులు నీలు చక్రవర్తి మాట్లాడుతూ.. ఆలయం తిరిగి తెరవడం హిందూ సమాజానికి ఎంతో ఉపశమనం కలిగించిందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల హామీలు కూడా ఆలయ పునఃప్రారంభానికి దోహదపడ్డాయి. అసన్‌సోల్ ఉత్తర్ అసెంబ్లీ నుంచి ఎన్నికైన కృష్ణేందు ముఖర్జీ.. ఈ ఆలయాన్ని ఏడాది పొడవునా తెరిచిఉంచేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు. దీంతో ఆయన ఆలయాన్ని సందర్శించిన తరువాత అధికారికంగా పునఃప్రారంభ కార్యక్రమం జరిగింది.
బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండగా.. బీజేపీ 206 స్థానాలు కైవసం చేసుకుని మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడం చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. దీంతో ఆ రాష్ట్రంలో దశాబ్దంన్నర కాలంగా పాలన సాగిస్తున్న టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ.. భవానీపూర్‌లో సువేందు అధికారి చేతిలో పరాజయం పాలవ్వడం.. రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది. మొత్తంగా చూస్తే.. బెంగాల్‌లో ప్రారంభమైన ఈ కొత్త రాజకీయ అధ్యాయం కేవలం ప్రభుత్వ మార్పునకే పరిమితం కాకుండా సామాజిక, సాంస్కృతిక రంగాలపైనా ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చదవండి:
శబరిమల కేసు.. జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు
'అధికారంలో ఉంటే సంక్షేమం.. ప్రతిపక్షంలో ఉంటే పోరాటం'