శబరిమల కేసు.. జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - May 05 , 2026 | 03:26 PM
శబరిమల వివాదంలో ‘విశ్వాసం’, ‘రాజ్యాంగ నైతికత’పై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. శబరిమల ఆలయ సంప్రదాయాల ఉల్లంఘనపై జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ, మే 5: ‘శబరిమల ఆలయం సహా ప్రార్థనా స్థలాల్లో మహిళల పట్ల వివక్ష’ కేసుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 11వ రోజు విచారణ చేపట్టింది. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్లపై సుప్రీంకోర్టు మండిపడింది. సంప్రదాయాలకు వ్యతిరేకంగా న్యాయవాదుల సంఘం ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ధర్మసనం ప్రశ్నించింది.
జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు
శబరిమల ఆలయ సంప్రదాయాల ఉల్లంఘనపై జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ నియమాలను పాటించని వారిని కోర్టు ప్రోత్సహించదని స్పష్టం చేశారు. దైవంపై విశ్వాసం ఉన్నవారు మాత్రమే ఆచారాలను గౌరవిస్తారని వ్యాఖ్యానించారు. కేవలం హక్కుల పేరుతో ఆలయ ప్రవేశం కోరడంపై జస్టిస్ నాగరత్న అసహనం వ్యక్తం చేశారు. దైవంపై నమ్మకం లేని వారు ఆలయంలోకి ప్రవేశించడం సరైనది కాదన్నారు. వందల ఏళ్లుగా ప్రజలు నమ్ముతున్న ఒక ఆచారాన్ని కేవలం 'మూఢనమ్మకం' అని కొట్టిపారేయలేమని, అది ఆ మతంలో భాగమా కాదా అనేది చూడాలని ఆమె అభిప్రాయపడ్డారు.
కాగా, ఏప్రిల్ 7వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసుపై విచారణ ప్రారంభించింది. గత నెల 28వ తేదీన ఈ కేసుపై 10వ రోజు విచారణ జరిగింది. కోర్టు విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు
జూబ్లీహిల్స్ అమ్మాయిల ట్రాప్ కేసు.. మరో నలుగురి అరెస్ట్