Share News

బార్‌లో వాగ్వాదం.. 18 ఏళ్ల యువతి మృతి

ABN , Publish Date - Jun 01 , 2026 | 10:07 AM

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ బార్‌లో చోటుచేసుకున్న చిన్నపాటి వాగ్వాదం ఓ యువతి ప్రాణాలను బలి తీసుకుంది.

బార్‌లో వాగ్వాదం.. 18 ఏళ్ల యువతి మృతి
Chennai Crime News

చెన్నై, జూన్ 01: ఓ బార్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ 18 ఏళ్ల యువతి ప్రాణం తీసింది. ఈ ఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది. నిందితులైన బాలమురుగన్ (21), జోశ్వ (19), కిషోర్ కుమార్ (19) లను పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలు విల్లుపూరం జిల్లాలో నివసిస్తున్న శ్రీలంక శరణార్థి యాన్సీ (18)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...


విల్లుపూరం జిల్లాలో నివాసం ఉండే యాన్సీ, ఆమె స్నేహితులు చెన్నైలోని ఓ ప్రైవేట్ బార్‌కి వెళ్లారు. అక్కడ యాన్సీ గ్రూప్ డ్యాన్స్ చేస్తుండగా.. అక్కడే ఉన్న మరో పురుషుల బృందం వాగ్వాదం పెట్టుకుంది. చిన్నపాటి గొడవ చిలికి చిలికి పెద్ద ఘర్షణగా మారింది. ఈ క్రమంలోనే బౌన్సర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు వర్గాలకు సర్థి చెప్పి బయటకు పంపించారు.


బార్ బయట వెళ్లిన తర్వాత కూడా వారి మధ్య మరోసారి వివాదం చోటుచేసుకుంది. బౌన్సర్లు కూడా మరోసారి రంగంలోకి దిగి రెండు వర్గాలను అక్కడి నుంచి వెళ్లిపోమని కోరారు. దీంతో యాన్సీ, తన స్నేహితురాలితో కలిసి ద్విచక్ర వాహనంపై తన నివాసానికి బయలుదేరింది. మార్గం మధ్యలో వారి బైక్‌ను ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టారు. అయితే యాన్సీ స్నేహితులు కారుపై రాళ్లు విసరడంతోనే ..వారు ఢీకొట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యాన్సీ అక్కడికక్కడే మృతి చెందంగా.. ఆమె స్నేహితురాలు తీవ్రంగా గాయపడింది. నిందితులను కఠిన శిక్ష విధించాలని మృతురాలి కుటుంబం కోరింది. 18 ఏళ్లలోపు వారిని బార్‌లోకి అనుమతించినందుకు అధికారులు ఆ ప్రైవేట్ బార్‌ను సీజ్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.


ఇవి కూడా చదవండి:

స్టార్ సింగర్ సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత..

బస్సులో మంటలు.. గుజరాత్ టీమ్‌కు తప్పిన ప్రమాదం

Updated Date - Jun 01 , 2026 | 11:02 AM