రాష్ట్రానికి రండి
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:06 AM
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి లోకేశ్ వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడిపారు. గురువారం ఒక హోటల్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం
పరిశ్రమలు ఏర్పాటు చేయండి
దేశ, విదేశీ ప్రఖ్యాత కంపెనీలకు లోకేశ్ ఆహ్వానం
వివో ఇండియా, గోద్రెజ్, సిస్కో సిస్టమ్, అబాట్,
యారా ఇంటర్నేషనల్ ప్రతినిధులతో చర్చలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి లోకేశ్ వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడిపారు. గురువారం ఒక హోటల్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని విజ్ఞప్తి చేశారు. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్, యాక్సెసరీస్, కన్య్జూమర్ ఎలకా్ట్రనిక్స్ తయారీ సంస్థ వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్‌తో లోకేశ్ భేటీ అయ్యారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో శరవేగంగా అభివృద్థి చెందుతున్న తిరుపతిలో వివో మొబైల్స్ కాంపోనెంట్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. వివో సరఫరాదారుల కోసం ఏపీలో ఒక కాంపోనెంట్స్ తయారీ పార్క్‌ను అభివృద్ధి చేయాలన్నారు. వివో, దాని అనుబంధ సంస్థల వెండర్ ఎకో సిస్టం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి ఒక సప్లై చైన్ సమావేశాన్ని నిర్వహించాలని లోకేశ్ సూచించారు. ఈ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామని అర్జిత్ సేన్ తెలిపారు. కాగా డేటా సెంటర్ల డిమాండ్‌కు అనుగుణంగా ఏపీలో యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్(యూసీఎస్) సర్వర్లు, స్విచ్‌లు, రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సిస్కో సిస్టమ్స్ (యూఎస్ఏ) మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్‌ను లోకేశ్ కోరారు. విశాఖపట్నంలో ఇంజనీరింగ్ సెంటర్/జీసీసీని ఏర్పాటు చేయాలన్నారు.
వైద్య పరికరాల యూనిట్ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్‌లోని ఏఎమ్‌టీజడ్ లేదా ఈఎంసీలలో ఒకచోట వైద్య పరికరాలు లేదా డయాగ్నోస్టిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా యూఎస్ఏకు చెందిన ప్రముఖ మెడికల్ డివైసెస్, డయాగ్నోస్టిక్స్, న్యూట్రిషన్, ఫార్మాస్యూటిక్స్ తయారీ సంస్థ అబాట్ మేనేజింగ్ డైరెక్టర్ ఇస్తేయాక్ అంజాద్‌కు మంత్రి లోకేశ్ విన్నవించారు. నక్కపల్లిలో రాబోయే బల్క్ డ్రగ్ పార్క్‌లో జెనరిక్ మందుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రతిపాదించారు. విశాఖపట్నంలో అబాట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ) ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా కోరారు.
స్టార్ట్‌పలను ప్రోత్సహించండి
విశాఖపట్నంలో భూమి లభ్యత, ఐటీ, జీసీసీ పాలసీ మద్దతుతో ఒక జీసీసీ లేదా టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్, టెక్నాలజీ సంస్థ మాస్టర్ కార్డ్ ఇంక్(యూఎస్ఏ) వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ లాహిరిని లోకేశ్ కోరారు. స్టార్ట్‌పలకు మార్గదర్శకత్వం వహించి, వాటిని ప్రోత్సహించడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్)లో ఫిన్‌టెక్ సలహాదారు సభ్యుడిగా చేరాల్సిందిగా ఆహ్వానించారు.
డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఏర్పాటు చేయండి
జర్మనీకి చెందిన ప్రముఖ ఎంటర్ ప్రైజ్ సాఫ్ట్‌వేర్, క్లౌడ్, బిజినెస్ ఏఐ అభివృద్థి సంస్థ శాప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లవ్‌నీష్ చనానాతో లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో స్మార్ట్ గవర్నెన్స్, ఎస్‌ఎంఈ డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్థి కోసం శాప్ ఆధ్వర్యాన డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విద్యార్థులకు శాప్ నైపుణ్యాభివృద్థి, సర్టిఫికేషన్ అందించడానికి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్‌తో కలిసి పనిచేయాలన్నారు.
ఆగ్రో కెమికల్ యూనిట్ ఏర్పాటు చేయండి
ఆగ్రో కెమికల్ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని గోద్రెజ్ ఇండస్ర్టీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్ స్వామిని మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. రెడీ టు ఈట్ పాల ఉత్పత్తుల కోసం ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.
యారా పబ్లిక్ ఎఫైర్స్ హెడ్‌తో భేటీ
ప్రముఖ క్రాప్ న్యూట్రిషన్, ఫెర్టిలైజర్స్, అమ్మోనియా తయారీ సంస్థ యారా ఇంటర్నేషనల్ ఏఎస్ఏ పబ్లిక్ ఎఫైర్స్, కమ్యూనికేషన్స్ హెడ్ వైశాలి చోప్రాతో లోకేశ్ సమావేశమయ్యారు. కాకినాడలో గ్రీన్-అమ్మోనియా మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్‌పోర్ట్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ప్రత్యేక ఎరువుల మిశ్రమం, సూక్ష్మపోషకాల ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో పంట-పోషణ సాంకేతికత, డిజిటల్ వ్యవసాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఈ వార్తలనూ చదవండి...