Share News

పీజీ కోర్సుల్లో చేరేవారేరి?

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:07 AM

డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా వాటిలో చేరేవారు లేకుండా పోతున్నారు. ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్సిటీ కళాశాలలో ఈ ఏడాది అడ్మిషన్లు పడిపోయాయి.

పీజీ కోర్సుల్లో చేరేవారేరి?

ఏకేయూలో పడిపోయిన అడ్మిషన్లు

451 సీట్లకు 68 మాత్రమే కేటాయింపు

ఒంగోలు విద్య, సెప్టెంబరు 24 (ఆంధ్ర జ్యోతి) : డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా వాటిలో చేరేవారు లేకుండా పోతున్నారు. ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్సిటీ కళాశాలలో ఈ ఏడాది అడ్మిషన్లు పడిపోయాయి. పీజీ సెట్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌లో ఏకేయూ కళాశాలలో కేవలం 15శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. యూనివర్సిటీ కళాశాలలోని మొత్తం 10 విభాగాల్లో మూడు విభాగాల్లో సీట్లు మొత్తం మిగిలిపోయాయి. మిగిలిన ఏడు విభాగాల్లో ఒకదాంట్లోనే మొత్తం సీట్లు కేటాయించారు. మిగిలిన ఆరు విభాగాల్లో ఒక అంకెకు మాత్రమే పరిమితమయ్యారు. సీట్ల అలాట్‌మెంట్‌ 15శాతంలో ఎంతమంది విద్యార్థులు చేరతారో వేచిచూడాల్సి ఉంది. పీజీ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. ఇంజనీరింగ్‌, డిగ్రీ, పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, వసతి దీవెనలు అందించిన గత ప్రభుత్వం సాధారణ పీజీ విద్యార్థులకు మాత్రం నిరాక రించింది. ఆ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పునరుద్ధరిస్తామని నారా లోకేష్‌ తన పాదయాత్రలో ప్రకటించినా ఇంత వరకూ ఆచరణలోకి రాలేదు. పీజీ కోర్సులు చదివినా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో విద్యార్థులు విముఖత చూపుతున్నారు.

ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ మాత్రమే

ఏకేయూ కళాశాలలో 10 విభాగాల్లో 451 సీట్లకు గాను కేవలం 68 సీట్లకు మాత్రమే విద్యార్థులు ఆప్షన్‌ పెట్టుకు న్నారు. ఫలితంగా 383 సీట్లు మిగిలిపోయాయి. సీటు వచ్చిన విద్యార్థుల్లో ఇప్పటివరకు 39 మందికి మాత్రమే కేటాయింపు పూర్తయి మెరిట్‌ ఆర్డర్లు డౌన్‌లోడ్‌ చేసుకోగా వారిలో కేవలం 10 మంది మాత్రమే చేరేందుకు సుము ఖత తెలిపారు. ఎమ్మెస్సీ మేథమెటిక్స్‌లో 44 సీట్లకు నలుగురుని మాత్రమే కేటాయించారు. ఎంపీఈడీ కోర్సులో 44 సీట్లు ఉండగా అన్ని సీట్లు అలాటయ్యాయి. ఎంఈడీ కోర్సులో 55 సీట్లకు మూడు, ఎంకామ్‌లో 44 సీట్లకు ఐదు, ఎంఏ ఎకనామిక్స్‌లో 44 సీట్లకు ఐదు అలాట్‌ అయ్యాయి. ఎంఏ ఎకనామిక్స్‌లో 44 సీట్లకు ఒక్కటి కూడా భర్తీ కాలేదు. ఎంఏ హిస్టరీలో 44 సీట్లకు ఒకటి, ఎంఏ సోషల్‌ వర్క్‌లో 44సీట్లు ఉండగా అన్నీ మిగిలిపోయాయి. ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో 44 సీట్లకు నాలుగు, ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో 44కు7 కేటాయించారు. ఎమ్మెస్సీ ఆక్వా కల్చర్‌లో 44 సీట్లకు అన్నీ మిగిలిపోయాయి.

Updated Date - Sep 25 , 2026 | 03:07 AM