మార్కాపురం జడ్పీపై నేతల కన్ను
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:12 AM
మార్కాపురం జడ్పీ తొలి చైర్మన్ పీఠం ఎక్కాలనే కుతూహలం నేతలందరిలో మొదలైంది. అందుకోసం పలువురు పార్టీల రహితంగా పావులు కదుపుతున్నారు. టీడీపీ ఈ విషయంలో దూకుడును ప్రదర్శిస్తోంది.
దూకుడు ప్రదర్శిస్తున్న టీడీపీ
అయోమయంలో వైసీపీ నేతలు
పెరిగిపోతున్న ఆశావహుల జాబితా
ఆర్థిక వనరులే ప్రామాణికంగా దృష్టి
అవకాశం ఇస్తే పార్టీలు మారేందుకు
సిద్ధమవుతున్న కొందరు నాయకులు
25న నూతన జడ్పీ కార్యాలయం..
మరో రెండు నెలల్లో కొత్త చైర్మన్
మార్కాపురం జడ్పీ తొలి చైర్మన్ పీఠం ఎక్కాలనే కుతూహలం నేతలందరిలో మొదలైంది. అందుకోసం పలువురు పార్టీల రహితంగా పావులు కదుపుతున్నారు. టీడీపీ ఈ విషయంలో దూకుడును ప్రదర్శిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేని వైసీపీ అయోమయంలో ఉంది. ఆ పార్టీలోని సీనియర్లు మాత్రం ఎలాగైనా గెలిచి తొలి చైర్మన్‌గా ఘనతకెక్కాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆర్థిక సంపన్నులు కొందరు అవకాశం దొరికితే కూటమికి జైకొట్టి పీఠం దక్కించుకోవాలని ఆశపడుతున్నారు.
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఉన్న జడ్పీలను కొత్త జిల్లాల వారీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఆ ప్రకారం మార్కాపురంలో జడ్పీ కార్యాయలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఈవోను కేటాయించారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మార్కాపురం జడ్పీకి ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రస్తుత అంచనా ప్రకారం నవం బర్‌లో జిల్లా పరిషత్ పాలక మండలి ఏర్పా టు కానుంది. అనివార్య కారణాలతో ఆలస్యమైనా ఒక నెల అటోఇటో పాలకమండలి ఏర్పాటు ఖాయమే. దీంతో పశ్చిమప్రాంతం లోని ముఖ్యమైన నాయకులు, ప్రముఖు లందరూ చైర్మన్ పదవిపై దృష్టి సారించారు. ప్రొటోకాల్ రీత్యా కూడా జడ్పీ చైర్మన్ పదవి ప్రధానమైంది. దీనికి తోడు తొలి చైర్మన్ పీఠం ఎవరెక్కినా వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. దీంతో ప్రాధాన్యత పెరిగి అందరూ దానిపై దృష్టి సారించారు.
త్వరలో రిజర్వేషన్లు ఖరారు
జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు త్వరలో ఖరారు కానున్నాయి. ప్రస్తుత అంచనా మేరకు మార్కాపురం జడ్పీ చైర్మన్ పదవి ఓపెన్ కేటగిరీ (ఓసీ) కింద ఉండవచ్చనేది సమాచారం. మహిళకు, దళితులకు కూడా రిజర్వు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. దీంతో ఓసీ కేటగిరీలో ఆస్థానం దక్కించుకునేందుకు పలువురు అప్పుడే పావులు కదుపుతున్నారు. దళితులకు రిజర్వు అయితే వైపాలెం టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు, పొదిలికి చెందిన అనిల్ అలియాస్ పండుతోపాటు మరో ఒకరిద్దరి పేర్లు పరిశీలించవచ్చని అధిష్ఠానంకు ఆ పార్టీ ప్రత్యేక సర్వే సంస్థ తెలిపినట్లు తెలి సింది. ఓసీ కేటగిరీలోనే ఉంటే ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు పలువురు ఉవ్విళ్లూరు తున్నారు. మార్కాపురం నియోజకవర్గ టీడీపీలో కీలకంగా వ్యవహరించే జడ్పీటీసీ మాజీ సభ్యుడు కె.రామిరెడ్డి, వైపాలెంనకు చెందిన శనగా నారాయణరెడ్డి, కనిగిరికి చెందిన ప్రసుత్తం డీసీఎంఎస్ చైర్మన్‌గా ఉన్న శ్యామల కాశిరెడ్డి, అదే నియోజకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.జనార్దన్ తదితర పేర్లు ఇప్పటికే ఆపార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆశించే వారందరికీ జడ్పీటీసీ స్థానాలకు అవకాశాలు ఇచ్చి తర్వాత చైర్మన్ అభ్యర్థిని అధిష్ఠానం ప్రకటించవచ్చని భావిస్తున్నారు. కోర్టు అనుమతి లభించకపోతే బీసీలకు 34శాతం జడ్పీ చైర్మన్ సీట్లు పార్టీపరంగా కేటాయించాలని భావిస్తున్న టీడీపీ ఓసీ కేటగిరిలోని కొన్ని స్థానాలను బీసీలకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
వైసీపీలో అయోమయం
స్థానిక ఎన్నికల విషయంలో వైసీపీ నేతలు అయోమయ స్థితిలో కనిపిస్తున్నారు. ఏ స్థానంలోనూ ఏకగ్రీవాలు జరగకూడదని ఆపార్టీ అధినేత జగన్ ప్రకటించినప్పటికీ ఎన్నికలను అడ్డుకునేందుకు ఆ పార్టీ తరఫున కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేస్తున్నారు. హైకోర్టులో అనుకూల తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని జగన్ చెప్పినట్లుగా ఆ పార్టీ నాయకులు అంటున్నారు. దీనికితోడు గతంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు విషయాన్ని జగన్ పట్టించుకోకపోవడం, పూర్తిచేయకుండా వెలిగొండను జాతికి అంకితం చేయడం వంటి విషయాలు, స్థానిక ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత ఏర్పడటం కూడా వారి అయోమయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో ఆ పార్టీ నాయకులు వేచిచూచే ధోరణిలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతానికి కిందిస్థాయి ఎన్నికలపైనే ఆ పార్టీలోని ఇన్‌చార్జిలు అడపాదడపా దృష్టిసారించారు.
పెరిగిపోతున్న ఆశావహులు
వైసీపీలోని కొందరు నాయకులు జడ్పీ పీఠంపై దృష్టి పెట్టారు. పార్టీ పరంగా అవకాశం రాకుంటే కూటమి ద్వారా అయినా జడ్పీ చైర్మన్ కావాలని వేచి చేస్తున్నారు. కొమరోలు ప్రాంతానికి చెందిన కె.రమణారెడ్డి జడ్పీ చైర్మన్‌గా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. అందుకే ఆయన తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన ఆరోపణలు నిజం కాదని, వైసీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. వైసీపీలోని సీనియర్ నాయకుల్లో కీలకమైన కేపీ కొండారెడ్డి కూడా ఈ విషయంపై దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయన కుమారుల్లో ఒకరైన కృష్ణమోహన్‌రెడ్డిని ఇటీవల కొందరు కలిసి జడ్పీ విషయమై చర్చించినట్లుగా సమాచారం. ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు కూడా జడ్పీని ఆశించి వైసీపీలో ముందుకొస్తే విఫలమైనా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటు పొందవచ్చని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. బళ్లారికి చెందిన ఒక పారిశ్రామికవేత్త అదే కోణంలో ఉన్నట్లు తెలిసింది. ఇక వైసీపీలోని ఒకరిద్దరు యువనాయకులతోపాటు ఆ పార్టీతో అంటకాగిన ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలు టీడీపీ తరఫున రంగంలోకి రావాలని పావులు కదుపుతున్నారు. అయితే పార్టీయేతర వ్యక్తులకు పదవులు ఇచ్చే అవకాశం లేదని లోకేష్ స్పష్టం చేయడంతో వారి అడుగులు ముందుకు పడటం లేదని తెలుస్తోంది.