సన్నాలకు రికార్డు ధర
ABN , Publish Date - Sep 25 , 2026 | 02:54 AM
ఖరీఫ్ సీజన్ వరి పంట చేతికొస్తున్న క్రమంలో సన్న ధాన్యానికి డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. తేమ శాతం ఎక్కువగా ఉన్న పచ్చి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,950 వరకు రికార్డు ధర పలుకుతోంది.
క్వింటాల్‌కు రూ.2,950 పలుకుతున్న రేటు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముందస్తు వరి కోతలు
పొలాల వద్దే పచ్చిగా ఉన్నప్పటికీ కొంటున్న వ్యాపారులు
పక్క జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు తరలుతున్న ధాన్యం
పెరిగిన బియ్యం ధ రలు.. 3 నెలల్లో రూ.10-13 పెంపు
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్ వరి పంట చేతికొస్తున్న క్రమంలో సన్న ధాన్యానికి డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. తేమ శాతం ఎక్కువగా ఉన్న పచ్చి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,950 వరకు రికార్డు ధర పలుకుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భవానీపేట్, వర్ని మండలం నెహ్రూనగర్ గ్రామాల్లో వరి కోతలు ఇప్పటికే ప్రారంభం కాగా.. బీపీటీ ధాన్యానికి అత్యధిక ధర పలకడం విశేషం. నిజామాబాద్ జిల్లా నుంచి నల్లగొండ, వరంగల్, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కూడా ధాన్యం తరలుతోంది. దీంతో రైతులకు అధిక ధర గిట్టుబాటవుతోంది. ఇటు రాష్ట్రంలో బియ్యం ధరలు కూడా పెరిగాయి. గత 3 నెలల కాలంలో కిలోకు క్రమంగా రూ.10-13 వరకు పెరిగాయి. సన్న బియ్యంలో టాప్ క్వాలిటీ బియ్యం ప్రస్తుతం కేజీ రూ.73-75 వరకు చేరింది. ఇక ధాన్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర సాధారణ రకాలైతే క్వింటాల్‌కు రూ.2,441 ఉంది. ఏ-గ్రేడ్ ధాన్యమైతే క్వింటాల్‌కు రూ.2,461 ఉంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ లెక్క ప్రకారం చూస్తే ధర క్వింటాల్‌కు రూ.2,941 అవుతుంది. అయితే తేమ శాతం 17 మాత్రమే ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. అంతకంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తీసుకోరు. ఎమ్మెస్పీ కూడా తరుగు లెక్కన తగ్గిపోతుంది.పచ్చి ధాన్యం ప్రైవేటు మార్కెట్ రేటు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. 20 - 30ు వరకు తేమ ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యాపారులు ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
ఈసారి ముందస్తు కోతలు..
సాధారణంగా దసరా పండుగ నాటికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి పంట కోతకు వస్తుంది. అయితే ఈసారి వరి కోతలు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పొరుగు జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా నిజామాబాద్ బాట పట్టారు. బీపీటీ ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.2,900-2,950 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నెహ్రూనగర్‌కు చెందిన సూర్య అనే రైతు 15 ఎకరాల్లో బీపీటీ వరి కోయగా.. క్వింటాల్‌కు రూ.2,950 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. కొందరు రైతులు ధర రూ.3 వేల చొప్పున అయితేనే అమ్ముతామని వ్యాపారులను డిమాండ్ చేస్తున్నారు. అయితే పొలాల వద్దే ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండటంతో ట్రేడర్లు రూ.50-100 ధర అధికంగా పెట్టేందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రవాణా ఖర్చులు క్వింటాల్‌కు రూ.150 చొప్పున అవుతున్నాయని, ఈ లెక్కన చూస్తే తమకు క్వింటాల్‌కు రూ.3,100 చొప్పున ధర పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక ఈసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనాలున్నాయి. ఇందులో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పక్క జిల్లాలు, పొరుగు రాష్ట్రాలకు తరలుతుందని భావిస్తున్నారు.
బియ్యం ధరలు పైపైకి...
ఇక బియ్యం ధరలు జూన్ నుంచి పోలిస్తే క్రమంగా పెరిగాయి. జూన్‌లో బీపీటీ సోనా మసూరి బియ్యం క్వింటాకు రూ.5,200 ఉండగా.. ప్రస్తుతం రూ.6 వేలకు చేరింది. జేఎ్‌సఆర్ ఫైన్ వెరైటీ 3 నెలల క్రితం రూ.6 వేలుండగా.. ప్రస్తుతం రూ.7,300 పలుకుతోంది. అంటే కిలోకు రూ.8 నుంచి రూ.13 వరకు బియ్యం ధరలు పెరిగాయి. మూడు నెలల కాలంలోనే బియ్యం ధరలు పెరగడానికి ప్రధాన కారణం కర్ణాటకలో క్రాప్ హాలిడే ప్రకటించడం అని చెబుతున్నారు. కర్ణాటకలో తుంగభద్ర ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించడంతో అక్కడ బియ్యం కొరత ఏర్పడింది. దీంతో బెంగళూరు ట్రేడర్లు మన బియ్యాన్ని అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇటు మహారాష్ట్రలో కూడా బియ్యానికి డిమాండ్ ఏర్పడిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇక తెలంగాణలో కూడా ఎల్‌నినో ప్రభావంతో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 50 శాతం పంట మాత్రమే సాగు చేయడం, రెండో పంట కూడా వచ్చే పరిస్థితి లేదని, క్రాప్ హాలిడే ప్రకటిస్తారన్న సమాచారం బియ్యం ధర పెరగడానికి కారణాలని మిల్లర్లు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమ్మాయిలు సర్కారుకు..అబ్బాయిలు ప్రైవేటుకు
గ్రామపంచాయతీల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు