Share News

అమ్మాయిలు సర్కారుకు..అబ్బాయిలు ప్రైవేటుకు

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:48 AM

కాలం మారింది.. ఆలోచనా విధానం మారింది.

అమ్మాయిలు సర్కారుకు..అబ్బాయిలు ప్రైవేటుకు

జగిత్యాల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కాలం మారింది.. ఆలోచనా విధానం మారింది. ఆడపిల్లల చదువుపై తల్లిదండ్రుల్లోనూ అవగాహణ పెరిగింది. అయినా.. పాఠశాలస్థాయి విద్యలో మాత్రం కొన్ని పాతదోరణలు కనిపిస్తున్నాయా..? జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వస్తోంది. అమ్మాయిలను ప్రభుత్వ పాఠశాలల్లో.. అబ్బాయిలను ప్రయివేటు పాఠశాలల్లో చేర్పించే దోరణి కొన్ని ప్రాంతాల్లో చోటుచేసుకుంది. దీనికి కారణం గారాబమా..? ఆడపిల్లలపై వివక్షా..? ఆర్థిక పరిస్థితులా..? అన్నది స్పష్టంగా తెలియకపోయినా.. పాఠశాల నమోదులో కనిపిస్తున్న తేడా చర్చనీయాంశంగా మారింది.

సర్కారు బడుల్లో బాలికలే ఎక్కువ..

జిల్లాలో ప్రభుత్వ, స్థానికసంస్థలు, కేజీబీవీ, టీజీఆర్‌ఈఐఎస్‌, యూఆర్‌ఎస్‌ తదితర ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 61,844మంది విద్యార్థులున్నారు. వీరిలో 28,966మంది బాలురు, 32,878మంది బాలికలున్నారు. అంటే ప్రభుత్వ విద్యాసంస్థల్లో బాలుర కంటే బాలికలే సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో 87,325మంది విద్యార్థులు నమోదయ్యారు. వీరిలో 47,270 మంది బాలురు, 40,055మంది బాలికలున్నారు. సంఖ్యాపరంగా పరిశీలిస్తే ప్రయివేటు పాఠశాలల్లో బాలుర కంటే బాలికలు 7,155మంది తక్కువగా నమోదయ్యారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో బాలుర కంటే బాలికలు 3,912మంది ఎక్కువగా నమోదయ్యారు.

ఎందుకీ తేడా?

పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రుల నిర్ణయాలు కుటుంబానికి కుటుంబానికి మధ్య మారుతుంటాయి. ఆర్థిక స్థోమత, పాఠశాల దూరం, రవాణా సౌకర్యం, భద్రతపై తల్లిదండ్రుల భావన, ఇంగ్లీష్‌ మీడియం పట్ల ఆకర్షణ, ప్రయివేటు పాఠశాలల్లో అదనపు సౌకర్యాలపై నమ్మకం వంటి అంశాలు విద్యా ఎంపికపై ప్రభావం చూపుతున్నాయంటున్నారు. అయితే ఒకే కుటుంబంలో అబ్బాయిని ప్రయివేటు పాఠశాలలో.. అమ్మాయిని ప్రభుత్వపాఠశాలలో చేర్పించే పరిస్థితులు కంటే.. దాని వెనుక కారణాలను పరిశీలించాల్సిన అవసరముందంటున్నారు. ఆడపిల్ల చదువుకు ఎక్కువ ఖర్చు చేయనవసరం లేదనే పాతభావనా..? లేకఅబ్బాయి భవిష్యత్తు కోసం ఎక్కువ ఖర్చు చేయాలనే కుటుంబ ఆలోచనా..? అన్నది సామాజికంగా చర్చించాల్సిన అంశంగా మారుతోంది.

చదువులోనూ సమానత్వం రావాలి..

ఆడపిల్ల.. మగపిల్ల అనే తేడా లేకుండా నాణ్యమైన విద్య అందరికీ అందాలన్నదే ప్రభుత్వ విద్యా విధానాల ప్రధానలక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీష్‌మీడియం, డిజిటల్‌విద్య, మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధనవంటి అంశాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. మరోవైపు ప్రయివేటు పాఠశాలలు సైతం తల్లిదండ్రుల ఆకర్షణ కోసం వివిధసౌకర్యాలు, విద్యా కార్యక్రమాలను అందిస్తున్నాయి. పిల్లల విద్య విషయంలో తల్లిదండ్రులు చేస్తున్న ఎంపికలను కేవలం గారాబం లేదా వివక్షగా తేల్చడం కంటే.. ఆ ఎంపిక వెనుక ఉన్న కారణాలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మండలాల వారీగా ప్రయివేటు బడుల్లో ప్రవేశాలు ఇలా..

----------------------------------------------------------------------

మండలం - బాలురు - బాలికలు - మొత్తం

-----------------------------------------------------------------------

బీర్‌పూర్‌ - 810 - 643 - 1,453

బీమారం - 345 - 285 - 630

బుగ్గారం - 739 - 653 - 1,392

ధర్మపురి - 2,092 - 1,804 - 3,896

ఎండపల్లి - 351 - 302 - 653

గొల్లపల్లి - 593 - 507 - 1,100

ఇబ్రహీంపట్నం - 675 - 609 - 1,284

జగిత్యాల - 14,800 - 12,285 - 27,085

జగిత్యాల రూరల్‌ - 1,315 - 1,067 - 2,382

కథలాపూర్‌ - 1,301 - 1,059 - 2,360

కొడిమ్యాల - 1,473 - 1,382 - 2,855

కోరుట్ల - 7,597 - 6,818 - 14,415

మల్లాపూర్‌ - 457 - 475 - 932

మల్యాల - 1,893 - 1,449 - 3,342

మేడిపల్లి - 359 - 308 - 667

మెట్‌పల్లి - 8,185 - 6,758 - 14,944

పెగడపల్లి - 398 - 314 - 712

రాయికల్‌ - 3,185 - 2,642 - 5,827

సారంగపూర్‌ - 240 - 228 - 468

వెల్గటూరు - 461 - 467 - 928

మొత్తం - 47,270 - 40,055 - 87,325

మండలాల వారీగా ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఇలా...

------------------------------------------------------------------------

మండలం - బాలురు - బాలికలు - మొత్తం

------------------------------------------------------------------------

బీర్‌పూర్‌ - 837 - 834 - 1,671

బీమారం - 830 - 791 - 1,621

బుగ్గారం - 502 - 483 - 985

ధర్మపురి - 1,824 - 1,857- 3,681

ఎండపల్లి - 925 - 733 - 1,658

గొల్లపల్లి - 1,432 - 1,691 - 3,123

ఇబ్రహీంపట్నం - 1,304 - 1,669 - 2,973

జగిత్యాల - 2,031 - 2,287 - 4,318

జగిత్యాల రూరల్‌ - 1,665 - 1,789 - 3,454

కథలాపూర్‌ - 1,944 - 2,279 - 4,223

కొడిమ్యాల - 1,227 - 1,277 - 2,504

కోరుట్ల - 2,588 - 3,310 - 5,898

మల్లాపూర్‌ - 1,943 - 2,206 - 4,149

మల్యాల - 1,382 - 2,210 - 3,592

మేడిపల్లి - 1,162 - 1,610 - 2,772

మెట్‌పల్లి - 2,463 - 1,827 - 4,290

పెగడపల్లి - 1,010 - 1,206 - 2,216

రాయికల్‌ - 2,207 - 2,427 - 4,634

సారంగపూర్‌ - 751 - 954 - 1,705

వెల్గటూరు - 939 - 1,438 - 2,377

మొత్తం - 28,966 - 32,878 - 61,844

Updated Date - Sep 25 , 2026 | 12:48 AM