Share News

12 ఏళ్లలో మోదీపై పావలా అవినీతి ఆరోపణ లేదు: అమిత్ షా

ABN , Publish Date - Nov 15 , 2026 | 09:05 PM

12 ఏళ్లలో ప్రధాని మోదీపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని అమిత్ షా స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, హైదరాబాద్ భారత్ సమ్మిట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

12 ఏళ్లలో మోదీపై పావలా అవినీతి ఆరోపణ లేదు: అమిత్ షా
Amit Shah on Rahul Gandhi

ఆంధ్రజ్యోతి, నవంబర్ 15: మహారాష్ట్రలోని పుణెలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన అసహనంతో కాంగ్రెస్ నేతలు విదేశీ వేదికలపై దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

యూపీఏ హయాంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రూ. 12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు, అవినీతికి పాల్పడిందని అమిత్ షా విమర్శించారు. అందుకే ప్రజలు వారిని అధికారం నుంచి దించివేసి, నరేంద్ర మోదీని ప్రధానిని చేశారని అన్నారు. గత 12 ఏళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీపై నాలుగు అణాల అవినీతి ఆరోపణ కూడా రాలేదని అమిత్ షా స్పష్టం చేశారు.

అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను అప్రతిష్ఠపాలు చేయడం ద్వారా అధికారం దక్కదని రాహుల్ గాంధీకి అమిత్ షా హితవు పలికారు. అధికారం కావాలంటే విదేశీ పర్యటనలు ఆపి, భారతదేశంలోని గ్రామాలను సందర్శించాలని, అప్పుడైనా ఏదో ఒక రోజు మీ వంతు రావచ్చని వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా ప్రశంసిస్తున్న మోదీ నాయకత్వాన్ని, భారత అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రపంచం ముందు తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ బాటలోనే నడిస్తే మరో 30 ఏళ్ల వరకు కాంగ్రెస్‌కు అధికారం రాదని ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు.


హైదరాబాద్ 'భారత్ సమ్మిట్ 2026'పై ఆగ్రహం

శనివారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహించిన 'భారత్ సమ్మిట్ 2026' పై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. దేశ విదేశాల నుంచి వామపక్ష భావజాలం కలిగిన వారిని ఆహ్వానించి, దానికి 'భారత్ సమ్మిట్' అని పేరు పెట్టి, ఆ అంతర్జాతీయ వేదికపై రాహుల్ గాంధీ భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

నిన్న హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్ 2026 ముగింపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 2014లో భారత ప్రజాస్వామ్యం నాశనమైందని, రాజకీయ వ్యవస్థలోకి మిలియన్ల కొద్దీ డబ్బు ప్రవహించి ఎన్నికల స్వరూపాన్నే మార్చివేసిందని ఆరోపించారు. అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన 14 కోట్ల మంది ఓటర్లు కాదని ఎన్నికల సంఘం పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రక్రియపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి కౌంటర్‌గా అమిత్ షా పుణె వేదికగా ఘాటుగా స్పందించారు. (Amit Shah on Rahul Gandhi)


ఈ వార్తలూ చదవండి

చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ కీలక కమాండర్ హతం

Updated Date - Nov 15 , 2026 | 09:14 PM