యోగికి మద్దతుగా అయోధ్య జీఎస్‌టీ డిప్యూటీ కమిషనర్ రాజీనామా
ABN , Publish Date - Jan 27 , 2026 | 07:10 PM
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి చేసిన విమర్శలను వ్యతిరేకిస్తూ అయోధ్య జీఎస్‌టీ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ కుమార్ సింగ్ రాజీనామా చేశారు.
అయోధ్య: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి చేసిన విమర్శలను వ్యతిరేకిస్తూ అయోధ్య జీఎస్‌టీ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ కుమార్ సింగ్ మంగళవారంనాడు రాజీనామా చేశారు. నైతిక కారణాలతోనే రాజీనామా చేసినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తాను సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పారు.
రాజీనామా అనంతరం సింగ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిపై స్వామి అవిముక్తేశ్వరానంద చేస్తున్న ఆరోపణలు నిరాధారమని అన్నారు. 'మా ముఖ్యమంత్రిపై, ప్రధానిపై చేస్తున్న ఆరోపణలపై గత రెండ్రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. ప్రభుత్వానికి మద్దతుగా, శంకరాచార్య వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాజీనామా నిర్ణయం తీసుకున్నాను' అని తెలిపారు. తన రాజీనామా పత్రాలను నేరుగా గవర్నర్‌కు పంపానని, నైతిక బాధ్యతగానే తాను ఈ రాజీనామా చేశానని చెప్పారు.
రాజకీయాల్లోకి చేరే ఆలోచన ఉందా అని సింగ్‌ను అడిగినప్పుడు అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని, అయితే దేశానికి వీలైనంత సేవ చేయాలని అనుకుంటున్నానని చెప్పారు. దీనికి ముందు కొత్త యూజీసీ నిబంధనలు, శంకరాచార్య అవిముక్తేశ్వరానంద వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బరేలి సిటీ మెజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి సైతం సోమవారంనాడు రాజీనామా చేశారు. 2019-బ్యాచ్ యూపీ పీసీఎస్ అధికారి అయిన అగ్నిహోత్రి తన రాజీనామాను గవర్నర్, బరేలి జిల్లా మెజిస్ట్రేట్ అవినాష్ సింగ్‌కు ఈ-మెయిల్ ద్వారా పంపారు. కాగా, అవిముక్తేశ్వరానంద్ స్వామి తరచుగా యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన, గోహత్య నియంత్రణ, హిందూ రాష్ట్ర డిమాండ్ వంటి అంశాలపై యోగి ప్రభుత్వ నిర్ణయాలు, సామర్థ్యాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాజాగా యోగి ఆదిత్యనాథ్‌ను కాలనేమితో పోల్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేనూ భారతీయ పౌరుడినే.. ఓసీఐ కార్డును ప్రదర్శించిన ఆంటోనియో కోస్టా
భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
For More National News And Telugu News