వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో పేలిన తుపాకీ.. ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Aug 16 , 2026 | 03:22 PM
ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 21 తూటాలు ఉన్న అతని 7.62 ఎంఎం పిస్టల్‌ను తనిఖీ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
వారణాసి, ఆగస్టు 16: ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 21 తూటాలు ఉన్న అతని 7.62 ఎంఎం పిస్టల్‌ను తనిఖీ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
ఘటన వివరాలు
ఇవాళ (ఆగస్టు 16) ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో, ఉత్తర ప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన కమలేష్ కేదార్‌నాథ్ రాయ్ అనే ప్రయాణికుడు తన భార్యతో కలిసి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (IX1810)లో ముంబై వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చాడు. అతని వద్ద 7.62 మిమీ లైసెన్స్డ్ పిస్టల్, 21 తూటాలు ఉన్నాయి. తనిఖీ ప్రక్రియలో భాగంగా తన వద్ద ఆయుధం ఉందని ప్రయాణికుడు వెల్లడించడంతో, అధికారులు అతడిని కేటాయించిన స్క్రీనింగ్ ఏరియాకు తీసుకెళ్లారు. ఆ సమయంలో తుపాకీ అన్ లోడ్ అయి ఉందో లేదో తనిఖీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తుపాకీ నుంచి దూసుకెళ్లిన బుల్లెట్ రీకాల్ అయి అక్కడ విధుల్లో ఉన్న AAICLAS స్క్రీనింగ్ సిబ్బంది సుమన్ కుమారి, రోహిత్ రాజ్‌లకు తగిలింది.
గాయపడిన స్క్రీనింగ్ సిబ్బంది సుమన్ కుమారి మాట్లాడుతూ, తుపాకీ అన్‌లోడ్ అయి ఉందని ప్రయాణికుడు చెబుతూ, దాన్ని నిరూపించడానికి ట్రిగ్గర్ నొక్కాడని తెలిపారు. దాంతో బుల్లెట్ పేలి తన రెండు కాళ్లకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. మరో సిబ్బంది రోహిత్ రాజ్ మాట్లాడుతూ, ప్రయాణికుడు ముందుగా మ్యాగజైన్ తొలగించి చెక్ చేశాడని, ఆపై ట్రిగ్గర్ నొక్కడంతో కాల్పులు జరిగి తన ఎడమ చేతి వేలికి గాయమైందని తెలిపారు.
వైద్య సహాయం: గాయపడిన ఇద్దరు సిబ్బందిని వెంటనే న్యూ లక్ష్మి ట్రామా సెంటర్‌కు తరలించి వైద్యం అందించారు.
అదుపులోకి ప్రయాణికుడు: ఘటన అనంతరం లోకల్ పోలీసులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
శాఖాపరమైన విచారణ: బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS), పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఉత్తర్వులు జారీ చేశాయి. ఆయుధాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు సరిగ్గా పాటించారా లేదా అనేది పరిశీలిస్తున్నారు.
ఈ ప్రమాదం జరిగినప్పటికీ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగలేదని, సదరు విమానం షెడ్యూల్ సమయం కంటే 14 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరిందని అధికారులు తెలిపారు.
విమానాల్లో ఆయుధాల రవాణా నిబంధనలు
విమానాల్లో అనుమతి కల్గిన ఆయుధాలను తీసుకెళ్లడానికి కఠినమైన నిబంధనలు ఉన్నాయి.
ఆయుధం పూర్తిగా అన్‌లోడ్ చేసి, లాక్ చేసిన హార్డ్-సైడెడ్ కంటైనర్‌లో ప్యాక్ చేయాలి.
చెక్-ఇన్ కౌంటర్ వద్ద వ్యాలిడ్ లైసెన్స్‌తో పాటు ఆయుధాన్ని స్పష్టంగా డిక్లేర్ చేయాలి. అమ్యూనిషన్ (తూటాలు) వేరుగా ప్యాక్ చేయాలి.
ఒక ప్రయాణికుడు ఒక లైసెన్స్డ్ రివాల్వర్/పిస్టల్/షాట్‌గన్ గరిష్టంగా 50 కార్ట్రిడ్జ్‌లను రిజిస్టర్డ్ బ్యాగేజీలో తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
దీనికై దేశీయ విమానాల్లో సుమారు రూ.5,000 (పన్నులు అదనం) హ్యాండ్లింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని
‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’
తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం