Share News

అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా.. నాయకత్వంపై అసంతృప్తి

ABN , Publish Date - Jun 16 , 2026 | 06:04 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కుదేలైన అన్నాడీఎంకేకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సి.విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు.

అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా.. నాయకత్వంపై అసంతృప్తి
C Vijyabaskar

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కుదేలైన అన్నాడీఎంకే (AIADMK)కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సి.విజయభాస్కర్ (C Vijayabaskar) తన పదవికి రాజీనామా చేశారు. లిఖితపూర్వకంగా తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు అందజేశారు. నిబంధనలకు అనుగుణంగా రాజీనామా పత్రం ఉందని, త్వరలోనే ఆమోదిస్తామని స్పీకర్ ఒక ప్రకటనలో తెలిపారు.


టీవీకేకు అనుకూలంగా ఓటేసిన విజయభాస్కర్

అన్నాడీఎంకె ప్రభుత్వంలో గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విజయ్‌భాస్కర్ ప్రస్తుతం పుదుక్కోట జిల్లా విరాలిమలై అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మే 13న అసెంబ్లీలో టీవీకే విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలలో ఆయన కూడా ఉన్నారు. అనంతర పరిణామాల్లో నలుగురు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికార టీవీకేలో చేరారు. తాజాగా విజయ్‌భాస్కర్ సైతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు ముందు అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కె పళనిస్వామి పేరును నేరుగా ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. నాయకత్వం అంటే అధికారం లేదా అహంకారం కాదని, ఒక కమిట్‌మెంట్‌తో అందరినీ కలుపుకొని వెళ్లడమని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించకుండా ప్రజల హృదయాలను నాయకత్వం ఎలా గెలుచుకుంటుందని ప్రశ్నించారు.


ఎవరీ విజయభాస్కర్

విజయభాస్కర్ 2011 నుంచి విరాలిమలై అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా నాలుగుసార్లు 2011, 2016, 2021, 2026లో గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరాలిమలై నుంచి పోటీచేసిన టీవీకే అభ్యర్థి పి.మురుగేశన్‌పై 62,073 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. 2013 నుంచి 2021 వరకూ జె.జయలిలిత, పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాల్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.


ఇవి కూడా చదవండి..

రాహుల్ ఓ పెద్ద జోక్, రాజకీయ పరిపక్వత లేదు.. డీఎంకే విమర్శల దాడి

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్

Updated Date - Jun 16 , 2026 | 06:09 PM